తీన్మార్ మల్లన్న బీసీ సీఎం నినాదం ఆంతర్యమేంటో?

రాజకీయ నాయకులకు కామన్‌గా వుండే ఒక లక్షణం ఏంటంటే, తమకు ఏదైనా పదవో, ఇంకోటో కావాలంటే.... వాటిని ఇచ్చే వారిని డైరెక్ట్.గా అడగరు. ఏదో ఒక కొత్త ఉద్యమం లేపుతారు. కొత్త నినాదాన్ని చేపడతారు. అప్పుడు సదరు పదవి ఇచ్చే వ్యక్తికి విషయం అర్థమవుతుంది. వెంటనే ఏదో ఒక పదవో, కాంట్రాక్టో ప్రసాదిస్తాడు. దాంతో ఉద్యమాలు, నినాదాలు లేవనెత్తిన సదరు నాయకుడు గప్‌చుప్ అయిపోయి తనకు దక్కిన దానితో సంతృప్తిపడుతూ వుంటాడు. ఈమధ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న కూడా ఇదే బాటలో పయనిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హోరాహోరీగా పోరాడి ఎమ్మెల్సీ అయ్యారు. అంత పోరాడి ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోరాటపటిమను మెచ్చి ఏదైనా మంచి పదవి ఇస్తారేమోనని మల్లన్న ఆశించి వుండవచ్చు. అలా ఆశించడం తప్పు కూడా కాదు. అయితే మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొత్తగా బీసీ ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన బీసీ కులసంఘాల అఖిల పక్ష రాష్ట్ర సదస్సులో పాల్గొన్న తీర్మాన్ మల్లన్న బీసీల గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనతోపాటు సమగ్ర కుల గణనని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిపించే బాధ్యత తనదేనని తీన్మార్ మల్లన్న అన్నారు. ఒకవేళ ఇవి జరగకపోతే తనదే బాధ్యత అని తన నెత్తిన బరువు పెట్టుకున్నారు. జనాభా ప్రాతిపదిక ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఉద్దేశమని అధిష్ఠానం వైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా బాగానే వుంది... ఇక్కడి వరకు ఎలాంటి అనుమానాలు లేవు. అయితే పనిలోపనిగా తీన్మార్ మల్లన్న ఒక  వ్యాఖ్య మాత్రం మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకునే చేసినట్టు కనిపిస్తోంది. 

ఇంతకీ ఆ వ్యాఖ్య ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం బీసీ రాష్ట్రంగా మారబోతోందట, 2028లో జరిగే ఎన్నికలలో బీసీ నాయకుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారట. పదేళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా వుంటానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అలాంటి వచ్చే ఎన్నికల తర్వాత బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని తీన్మార్ మల్లన్న అంటున్నారంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కిందకి నీళ్ళు తెచ్చే వ్యవహారమే కదా. అలాగే, ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశ వున్నప్పటికీ అవకాశం లేక ఊరుకున్న తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులలో లేనిపోని ఆశలు కలిగించడమే కదా! ఇంకానయం, తీన్మార్ మల్లన్న బీసీ ముఖ్యమంత్రి వస్తాడని మాత్రమే అన్నారు. బీసీ అయిన తానే ముఖ్యమంత్రి అవుతానని అనలేదు. ఏది ఏమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా వున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్రను పోషించిన తనది కేవలం ఎమ్మెల్సీ స్థాయి మాత్రమే కాదు.. ఇంకా పెద్ద స్థాయి అని, ఆ స్థాయిని రేవంత్ రెడ్డి ఇంకా గుర్తించలేదని తీన్మార్ మల్లన్న ఫీలవుతున్నట్టు అర్థమవుతోంది. మరి తీర్మాన్ మల్లన్నఈ ఆవేదనను రేవంత్ రెడ్డి గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారో, లేదా మల్లన్న ఆవేదదను ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేస్తారో చూడాలి.