డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూటమి సర్కార్ అండ.. మంత్రి అనిత

వైకాపా హయాంలో ప్రభుత్వ వేధింపులకు గురై మరణించిన వైద్యుడు సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో కరోనా నుంచి రక్షణకు వైద్యులకు కనీసం మాస్కులు కూడా ఇవ్వలేందంటూ విమర్శించిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం నానా విధాలుగా వేధించిన సంగతి తెలిసిందే. నర్సీపట్నం ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న సుధాకర్ ను సస్పెండ్ చేసింది. పిచ్చివాడిగా ముద్ర వేసింది. మండుటెండలో అర్ధనగ్నంగా నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చో పెట్టింది. ప్రభుత్వ వేధింపుల కారణంగా డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించారు.  

 డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయిని హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం (మార్చి 28)న పరామర్శించారు. విశాఖ సీతమ్మధారలో ఆమె నివసిస్తున్న ఇంటికి వెళ్లిన మంత్రి అనిత ఆమెను పరామర్శించి, అన్నివిధాలుగా అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు.  కొడుకును కోల్పోవడం, సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపై భావోద్వేగానికి గురైన  కావేరిబాయిని ఓదార్చారు.  కొవిడ్‌ సమయంలో మాస్కులు కావాలని అడిగినందుకు జగన్‌ ప్రభుత్వం సుధాకర్‌ను విధులు నుంచి తొలగించిందని దుయ్యబట్టారు. దీనిపై తాను తెదేపా మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో రాసిన లేఖను హైకోర్టు సుమోటాగా స్వీకరించి అప్పటి వైకాపా ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చిందని ఈ సందర్భంగా అనిత గుర్తు చేశారు