ఇప్పటికీ వానాకాలం చదువులే!

ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన చదువు అందించాలన్న సదాశయంతో ఎప్పుడో 2020లోకే కేంద్రం జాతీయ విద్యావిధానాన్ని రూపొందించింది. ఐదేళ్లు గడుస్తున్నా ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాల వేగం నత్తతో పోటీ పడుతోంది. ఇప్పటికీ దేశంలో విద్యార్థులకు అందుతున్నది వానాకాలం చదువులే. 21వ శాతాబ్దపు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెరగలేదు. విద్యా ప్రమాణాలను పెంచాలి, పరిశోధనలకు పెద్ద పీట వేయాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేయడంలో ప్రభుత్వాల వైఫల్యం విద్యార్థులకు శాపంగా మారింది.

ఇందుకు ప్రధాన కారణం రాజకీయమే. బడ్జెట్ లో సింహభాగం తదుపరి ఎన్నికలకు పెట్టుబడిగా భావిస్తూ ఉచితాలకు కేటాయించడమే. అదే సమయంలో విద్యకు కేటాయింపులు తగ్గిపోవడమే. విధానాల రూపకల్పనే కానీ నాణ్యతతో కూడిన విద్యను ప్రణాళికా బద్ధంగా విద్యార్థులకు అందించాలన్న రాజకీయ సంకల్పం ప్రభుత్వాలలో కొరవడింది. ఎన్నికలు, ఓట్లు, విజయం లక్ష్యంగానే ప్రభుత్వాల ప్రణాళికలు, కేటాయింపులు ఉంటున్నాయి. 

 2021-22 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 14.89 లక్షల పాఠశాలల్లో 26.52 కోట్లమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే చాలా వరకూపాఠశాలల్లో కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చాలా వరకూ పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవు. ఆట మైదానాలు లేవు.  ఇక పాఠశాల భవనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే  అంత మంచిది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు పాతిక శాతం పాఠశాలల పరిస్థితి ఇప్పుడో, ఇహనో కూలిపోతాయా అన్నంతగా శిథిలావస్థకు చేరుకున్నాయి. సరిపడా తరగతి గదులు లేవు. విద్యార్థుల సంఖ్యకు ఉండాల్సిన టీచర్ల సంఖ్యకూ అసలు పొంతనే లేదు.  మరుగుదొడ్లు లేని పాఠశాలలు లెక్కలేనన్ని ఉన్నాయి.  ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ప్రతి సౌకర్యం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో తప్పని సరిగా ఉండాలి. అయితే దేశంలో ఆ చట్టం అమలు అవుతున్న దాఖలాలు లేవు. యువభారతం అంటూ భుజాలు తడుముకోవడమే తప్ప.. యువకులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా విద్యను అందించే విషయంలో మాత్రం మన ప్రభుత్వాలు పూర్తిగా వెనుకబడ్డాయని చెప్పక తప్పదు.