గోడ దూకిన కిరణ్ బేడీ..
posted on Oct 27, 2017 10:54AM
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ కు మారుపేరు అని అందరికీ తెలిసిందే. ఇటీవలే అర్థరాత్రి మహిళలకు భద్రతా ఉందో..?లేదో..? అని తెలుసుకునేందుకు గాను ఓ స్కూటీపై తానే స్వయంగా వెళ్లి అందరినీ అశ్చర్యపరిచారు. తాజాగా ఇప్పుడు గోడదూకి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇంతకీ కిరణ్ బేడీ ఎందుకు గోడ దూకాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. కిరణ్ బేడీ ఓ ఆస్పత్రిలో అత్యవసర తనిఖీ నిమిత్తం అక్కడికి వెళ్లారు. ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించి, పరిసరాలు బాగాలేవని, దోమలు రాజ్యమేలుతున్నాయని చెబుతూ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక అక్కడికి వెళ్లిన ఆమె ప్రాంగణంలోని చుట్టూ గోడ నిర్మించివున్న 'లేడీ ఆఫ్ లౌర్డెస్' విగ్రహం వద్దకు ఆమె వెళ్లాలని చూశారు. అయితే దానికి తాళం వేసి ఉండటంతో... అధికారులు తాళాల కోసం ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో అక్కడ కొంతసేపు వేచి చూసిన ఆమె... ఇంకా ఒక్కక్షణం కూడా ఆగకుండా.. గోడ దూకి లోపలికి వెళ్లారు. ఈ గోడ ఎత్తు సుమారు 3.5 అడుగుల ఎత్తు ఉంది. ఇక ఆమెతో పాటు ఉన్న కారైకల్ కలెక్టర్ ఆర్ కేశవన్, ఎస్పీ వీజే చంద్రన్, ఇతర అధికారులు కూడా ఏం చేయలేక గోడదూకి వెళ్లాల్సి వచ్చింది.