నకిలీ స్టాంపుల సూత్రధారి కరీం తెల్గీ కన్నుమూత
posted on Oct 26, 2017 5:54PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. ప్రభుత్వాలనే గడగడలాడించిన నకిలీ స్టాంపుల కుంభకోణంలో సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ కన్నుమూశాడు. గత కొంతకాలంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తెల్గీ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. రూ. 33 వేల కోట్ల విలువైన నకిలీ స్టాంపు పేపర్లను ముద్రించి విక్రయించాడన్న అభియోగంపై తెల్గీని 2001 నవంబర్‌లో అజ్మీర్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో దోషిగా తేలడంతో న్యాయస్థానం 43 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.202 కోట్ల జరిమానా విధించింది. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. తెల్గీకి 20 సంవత్సరాల నుంచి మధుమేహం, రక్తపోటు ఉన్నాయి.. దీనికి తోడు జైలులోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆయనకు హెచ్‌ఐవీ సోకిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ అనారోగ్య సమస్యలతో తెల్గీ ఆరోగ్యం విషమించడంతో ఆయనను విక్టోరియా ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో పాటు మరికొందరికి సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలింది.