కలలు కనే కళ్ళని అలవనీకండి..

ఎగ్జామ్స్ టైం వస్తోందంటే చాలు పిల్లలు చదివి చదివి అలసిపోతారు. అలాంటి చిన్ని కళ్ళని మనం కాకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. వాళ్ళు ఎక్కువగా చదవటం వల్ల వచ్చే ఒత్తిడిని కళ్ళు వెంటనే మనకి తెలియచేస్తాయని చెప్తున్నారు కంటి వైధ్యులు. అలా అలిసిపోయిన కళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాపాడుకోవచ్చట.


పిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళ గదిలో ఉండే గాలి వెలుతురుని అంతగా పట్టించుకోరు. తొందరగా చదివేసుకోవాలనే తపన తప్ప వాళ్ళకి ఇంకో ధ్యాస ఉండదు. తగినంత వెలుతురు లేని చోట చదవటం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందిట.

 

* ఏకధాటిగా చదివే సమయంలో కళ్ళనుంచి నీరు కారుతుంది. అలాంటి సమయంలో పల్చటి మజ్జిగలో తడిపిన దూదిని కళ్ళ మీద వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచినా చాలు.


* నిద్ర లేవగానే ముందుగా కళ్ళ మీద చల్ల నీళ్ళని అయిదు నిమిషాల పాటు కొట్టుకోవాలి. ఇలా చేస్తే ఎంత అలిసిపోయిన కళ్ళయినా సేద తీరుతాయి.


* కళ్ళ మంటలు తగ్గాలంటే ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ ఉండాలి. అదే పనిగా ఎక్కువసేపు ఒకే వైపు చూస్తూ ఉండిపోకూడదని చెప్తున్నారు డాక్టర్లు.

 

* అలిసిపోయిన కళ్ళకి ఫ్రిజ్ లో పెట్టి తీసిన టీ బాగ్స్ బాగా పనికొస్తాయి. అలా బయటకి తీసిన టీ బాగ్స్ ని కళ్లపై ఉంచుకుని కాసేపు అయ్యాక తీసి చల్ల నీళ్ళతో కళ్ళు కడిగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది.


* కీరా దోసని గాని, బంగాళదుంపని గాని పల్చటి చక్రాలుగా తరిగి కళ్ల రెప్పలపై వేసి ఉంచినా కళ్ళు త్వరగా చల్లబడతాయి.

 

* అలసట వల్ల కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తే టమాటో గుజ్జులో చిటికెడు పసుపు, 1 స్పూన్ నిమ్మరసం,1 స్పూన్ సెనగపిండి వేసి ముద్దలా చేసి దానిని కనురెప్పలపై పూసి అరగంట తర్వాత కడిగేసుకుంటే బ్లాక్ సర్కిల్స్ తొందరగా మాయమవుతాయి.


* రోజ్ వాటర్ కళ్ళకి మంచి మందులా పనిచేస్తుంది. రోజ్ వాటర్ లో దూది ముంచి దానిని కనురెప్పలపై వేసినా కళ్ల అలసట తగ్గుతుంది.


* చదువుతూనే కళ్ళకి అప్పుడప్పుడు చిన్నపాటి ఎక్సరసైజ్ ని చేయిస్తూ ఉండాలి. ఐ బాల్స్ ని గుండ్రంగా తిప్పుతూ, కిందకి మీదకి,ఎడమవైపు కుడివైపు తిప్పుతూ ఉంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.


ఈ జాగ్రత్తలతో పాటు కళ్ళకి మంచి ఆరోగ్యనిచ్చే ఆహారం కూడా తీసుకుంటే పిల్లల కళ్ళు దెబ్బతినకుండా ముద్దులొలుకుతూ ఉంటాయి.

--కళ్యాణి