బీజేపీ అజెండా అమలు దిశగా కీలక ముందడుగు
posted on Apr 5, 2025 11:53AM
.webp)
ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు విషయంలో చాల పట్టుదలగా ఉంది. భాగస్వామ్య పార్టీలపై తనదైన ముద్ర వేస్తూ మోడీ సర్కార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు దిశగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నది. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందింది. వక్ఫ్ వ్యవస్థ లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం వల్లే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని స్వయంగా ప్రధాని మోడీయే ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభలలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడం కీలక పరిణామమనీ,ఈ బిల్లు ఆమోదంతో సామాన్య ముస్లింలకు మేలు చేకూరుతుందనీ మోడీ నమ్మకంగా చెబుతున్నారు. కాంగ్రెస్,ఇతర ప్రతిపక్షాలు,ముస్లిం వర్గాల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.
లోక్ సభలో 288-232 గా,రాజ్యసభలో128-95 గా ఓట్లు వచ్చాయి. ఉభయసభల్లోనూ ఈ బిల్లుపై విసృతంగా చర్చ జరిగింది. లోక్ సభలో 14 గంటలు,రాజ్యసభలో 13గంటల పాటు చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు బిల్లులోని లోపాలను బలంగా ఎత్తి చూపాయి. అనూహ్యంగా వక్ఫ్ బిల్లు ను వ్యతిరేకించే విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఏకతాటిపై నిలబడ్డాయి. అందుకే సునాయాసంగా పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందుతుని అంతా భావించినా వక్ఫ్ బిల్లు ను పాస్ చేయించుకోవడానికి కేంద్రం నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలోనే వక్ఫ్ బిల్లు విషయంలో అనుమానాలు ఉన్నాయి. కూటమి ధర్మంలో భాగంగా బిల్లును గట్టిగా వ్యతిరేకించకపోయినా, పట్టుబట్టి మరీ తమకు కావలసిన సవరణలు చేయించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన సవరణల్లో ఒక్కటి మినహా..మిగిలిన అన్నిటినీ మోడీ సర్కార్ అంగీకరించింది. ఆ మేరకు సవరణలు చేసింది. చంద్రబాబు మద్దతు కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకం కనుకనే మోడీ ఈ సవరణలకు ఓకే చెప్పారన్నది నిర్వివాదాంశం.
ఇక ఇప్పుడు ఉభయసభల ఆమోదంతో వక్ బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ముస్సల్మాన్ వక్ఫ్ చట్టం1923 రద్దై కొత్త చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డు లు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్దారించుకోవడానికి కలెక్టర్ల వద్ద వాటిని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7లక్షల ఆస్తులు వక్ఫ్ బోర్డులో నియంత్రణలో ఉన్నాయి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తా కాదా అని నిర్ణయించే అధికారం ఇస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ దానిని రద్దు చేయకపోతే బోర్డు నిర్ణయం అంతిమం అవుతుంది.వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారం కొత్త చట్టం కలెక్టర్లకు వర్తించేలా చేస్తుంది. నిర్ణయం వచ్చేవరకూ వివాదస్పద ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు. ఈ బిల్లు మేరకు వక్ఫ్ కౌన్సిల్ లో22మందిలో ఇద్దరు ముస్లిమేతర వ్యక్తులు ఉండవచ్చు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు లో 11 మంది సభ్యుల్లో ఇద్దరు ముస్లిమేతరలు ఉండవచ్చు. రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలు ఆడిట్ చేయించాలి. ముస్లిం మతం కనీసం ఐదేళ్లు పాటించేవారు తమ ఆస్తిని వక్ఫ్ కు ఇవ్వవచ్చు. వక్ఫ్ ప్రకటనకు ముందే మహిళలు తమ వారసత్వం పొందాలని, విడాకులు తీసుకున్న మహిళలు,వితంతువులు,అనాధలకు ప్రత్యేక నిబంధనలు ఈ బిల్లు నిర్దేసిస్తుంది. ఈ బిల్లు ముస్లింలకే లాభమని,ముస్లీమేతరులు జోక్యం చేసుకోలేరని కేంద్రమైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా చెబుతున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటన లో బిజీగా ఉండగా హోంమంత్రి అమిత్ షా 12 గంటలపాటు ఉభయ సభల్లో ఉండి ప్రణాళిక ప్రకారం బిల్లు ఆమోదం జరిగేలా చూసి తన వ్యూహ చతురతను, సామర్ధ్యాన్నీ మరోసారి చాటారు.
ఇదిలావుండగా వక్ఫ్ సవరణ బిల్లు2025పై తాజాగా కాంగ్రెస్,ఎంఐఎం సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేసారు.ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సవాల్ చేసారు. ముస్లింసమాజ ప్రాధమిక హక్కులు ఉల్లంఘించే లా బిల్లు ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా జగన్ నేతృత్వంలోని వైసీపీ వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకించి సంచలనం రేపింది. రాష్ట్రంలో మైనార్టీలకు కలుపుకుని టీడీపీ,జనసేనలను దెబ్బకొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీ తన అజెండా అమలు విషయంలో పడిన కీలక ముందడుగుగా వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.