జగనన్న కాలనీల్లో భారీ అవినీతి!
posted on Apr 5, 2025 11:06AM

ఒక్క నెల్లూరు జిల్లాలోనే 120 కోట్ల అవినీతి దందా
మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపణ
జగన్ హయాంలో కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా పాలన సాగింది. జగన్ ఐదేళ్ల పాలన అంతా దోచుకో.. దాచుకో అన్న తరహాలోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన తరువాత.. జగన్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతోంది. తాజాగా జగనన్న కాలనీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి ఆరోపించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే జగనన్న కాలనీల్లో 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన తెలిపారు.
పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి తిప్ప వద్ద గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన నాసిరకం ఇళ్ల నిర్మాణాలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి శుక్రవారం (ఏప్రిల్ 4) పరిశీలించిన మంత్రి కొలుసు, గత పాలకులు గృహ నిర్మాణాన్ని అవినీతి కూపంగా మార్చారని విమర్శించారు. జగనన్న కాలనీల్లో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 120కోట్ల అవినీతి జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా మరెంత జరిగిందోనన్న విషయం తేలాల్సి ఉందన్నారు. పొదలకూరు చిట్టేపల్లి తిప్ప వద్ద ఇళ్ళ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. అక్కడ నిర్మించిన పునాదులు నివాసయోగ్యం అని తేలితే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయిస్తామని, నివాసయోగ్యం కాదని తేలితే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామని చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఇల్లు కట్టించే ఇవ్వాలన్నదే చంద్రబాబు ఆశయమన్న కొలుసు పార్థ సారథి, గతంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో భాగంగా ఆగిపోయిన పేమెంట్లు మొత్తం చెల్లిస్తామన్నారు.
.webp)
సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ చిట్టిపల్లి తిప్ప వద్ద జగనన్న కాలనీ లెవెలింగ్, నిర్మాణాల పేరుతో ఆరున్నర కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు దేగా రవి రాఘవేంద్ర, పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, కలిచేటి శ్రీనివాసులు రెడ్డి, పెంచల నాయుడు, ఆదాల సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.