సింగపూర్ బయలు దేరిన పవన్, చిరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.   చిన్న కొడుకు మార్క్ శంకర్ తాను చదువుతున్నపాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లే ముందు ఈ విషయంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజునాడే చిన్న కుమారుడు ప్రమాదానికి గురయ్యాడని గద్దద స్వరంతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రస్తుతం తన చిన్న కుమారుడు క్షేమంగానే ఉన్నాడనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ పవన్ కల్యాణ్ చెప్పారు.  ఈ ప్రమాదంలో చాలా మంది పిల్లలు గాయపడ్డారన్న పవన్ వారిలో తన కుమారుడు కూడా ఒకరని చెప్పారు.    తన కుమారుడు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తనకు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, మంత్రి నారా లోకేష్ తదితరులందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.  

ఇలా ఉండగా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డాడన్న విషయం తెలిసిన వెంటనే పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.