కేరళ క్యాస్ట్రో అంటూనే.. పొమ్మన్నారు..?
posted on May 21, 2016 3:15PM

వీ.ఎస్.అచ్యుతానందన్...కేరళ రాజకీయాల్లోనే కాదు, ప్రస్తుత భారత రాజకీయాల్లోనూ కురువృద్ధుడు. కేరళ ఫిడెల్ క్యాస్ట్రోగా, రైతు బాంధవుడిగా, మచ్చలేని వ్యక్తిగా తనదైన ముద్రవేసిన వ్యక్తికి ఘోర అవమానం జరిగింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా..? అంటూ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు. సీఎం రేసులో అచ్యుతానందన్, పినరయి విజయన్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ను ఖరారు చేస్తూ సీపీఎం అగ్రనాయకత్వం నిర్ణయించింది. సీఎం ఎన్నికపై నిన్న తిరువనంతపురంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ సమావేశం నిర్వహించారు. అయితే చివరి వరకు వేచి చూసిన అచ్యుతానందన్‌కు నిరాశే మిగిలింది. వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఆయనను ఈ పదవికి ఎంపిక చేయలేకపోతున్నామని..కాని ఆయన సేవలు మాకు ఎల్లవేళలా అవసరం అని సీతారాం ఏచూరి తెలిపారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అచ్యుతానందన్ ఆవేశంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
93 ఏళ్ల అచ్యుతానందన్ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు. స్వతంత్ర పోరాటంలోనూ, అనేక కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేకాదు సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. 2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ పనిచేశారు. సీఎంగా రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ రంగాన్ని ప్రొత్సహించి, ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఉచిత సాఫ్ట్‌వేర్‌ను అందించిన ఘనత ఆయన సొంతం. పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొందారు. 93 ఏళ్ల వయసులోనూ పార్టీ అప్పగించిన బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని ఎల్‌డీఎఫ్‌ను అధికారంలోకి తెచ్చారు. రోజుకో జిల్లా చొప్పున తిరుగుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అలాంటి ఆయనకు సీఎంగా అవకాశం రాకపోవడంతో కాస్త కోపంగానే ఉన్నారు. కనీసం రెండేళ్లయినా ముఖ్యమంత్రిగా చేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదు.
అటు ఆయన అభిమానులు, మద్దతుదారులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన్ను ఉపయోగించుకుని తీరా గెలిచిన తర్వాత అచ్యుతను వయసు పేరు చెప్పి పక్కన బెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో ప్రచారం చేసినప్పుడు అచ్యుతానందన్ వయసు గుర్తుకు రాలేదా అని మండిపడుతున్నారు. అటు వృద్ధ సింహన్ని బుజ్జగించేందుకు సీపీఎం అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. మరి అచ్యుతానందన్ అలక వీడుతారా? లేదంటే తను అనుకున్నది సాధించేందుకు ఇంకేమైనా చేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.