అరవింద్ కేజ్రీవాల్ మార్క్'ఫేక్' రాజకీయాలు!
posted on Dec 15, 2016 3:32PM

రాజకీయాల్లో కొంత మేర డ్రామా అవసరమే. కాని, రాజకీయమే డ్రామా అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ లాంటి పెద్ద పెద్ద అంశాలు వుండొచ్చు, వుండొకపోవచ్చు. కాని, కనీసం కామన్ సెన్స్ , న్యూసెన్స్ చేయకుండా వుండే డిగ్నిటీ అన్నా వుండాలి. వీటన్నిటికీ తాను అతీతం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. భారీ మెజార్జీతో రెండోసారి ఢిల్లీ సీఎం అయినా ఆయన ఎప్పుడు చూసినా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత లాగే మాట్లాడుతాడు తప్ప ఏనాడూ రాష్ట్ర సీఎంగా వ్యవహరించరు. మోదీని విమర్శించంది రోజు గడవని ఆయన రాను రాను మరీ డ్రామా మాస్టర్ గా మారిపోతున్నారు. తాను చేసే ఆరోపణల్లో పస ఎంతా అన్నది, వాటి వల్ల తనకి , జనానికి లాభం ఎంతా అని ఆలోచించటం లేదు...
మోదీపై అరవింద్ అత్యంత తాజా ఆరోపణ ఆయన విద్యార్హతలు నిజం కాదని! ఇది ఇంతకు ముందే ఏకే ప్రధాని పై గురి పెట్టిన అస్త్రం. అయితే, ఢిల్లీ, గుజరాత్ యూనివర్సిటిల్లో మోదీ సర్టిఫికెట్లు నకిలీ అని ఏ విధంగానూ నిరూపించలేకపోయారు. కోర్టులో కేసు నడుస్తూనే వుంది. కాని, ఇంతలోనే ఢిల్లీ సీఎం తన సహజ శైలిలో మీడియా ముందు విరుచుకుపడ్డారు. మోదీ అసలు చదువుకోలేదని, అందుకే, ఆయన నోట్లు రద్దు చేసి దేశం మొత్తాన్ని సంక్షోభంలో పడేశారని అన్నారు. డీమానిటైజేషన్ ఇబ్బందులు నిజమే కావచ్చు కాని... మోదీ నకిలి సర్టిఫికెట్లకి , డీమానిటైజేషన్ కి లింకు పెట్టడం ఏంటి? అయినా ప్రధానులు, ముఖ్యమంత్రులు చదువుకున్న వారే కావాలని మన రాజ్యాంగంలో లేదు కదా? ఒకవేళ చదువుకున్న ప్రధానే వుంటే నోట్ల రద్దు సక్రమంగా జరిగిపోయేదా? ఇలాంటి అనేక లాజికల్ ప్రశ్నలకి కేజ్రీవాల్ వద్ద సమాధానం లేదు.
నరేంద్ర మోదీ మన ప్రతిపక్షలకి నచ్చకపోవచ్చు. అలాగే, దేశంలోని చాలా మంది జనానికి, సంస్థలకి, సంఘాలకి నచ్చకపోవచ్చు. కాని, ఆయన ప్రపంచం ముందు భారతదేశ ప్రధాని. అటువంటి స్థాయిలో వున్న వ్యక్తిని సహేతుకంగా విమర్శించాలి కాని అర్థం పర్థం లేని ఆరోపణలు చేయకూడదు. అది దేశానికే అవమానం. అసలు అరవింద్ చెప్పినట్టు మోదీ నిజంగా చదువుకున్న వాడు కాకపోతే వచ్చిన నష్టం ఏంటి? 2014లో ప్రజలు ఆయన ఏ డిగ్రీ, ఏ యూనివర్సిటీ నుంచి సాధించాడని నిర్ధారించుకుని ఓటు వేయలేదు కదా? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ట్రాక్ రికార్డ్ గమనించి వేశారు. ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారు. కాని, కేజ్రీవాల్ ఇవేవీ పట్టించుకోకుండా.. జనానికి ఎలాంటి ఉపయోగం లేని ప్రధాని విద్యార్హతల అంశం రచ్చ చేయటం డ్రామా మాత్రమే అనిపించుకుంటుంది!
ఢిల్లీ సీఎం అయినప్పటికీ కేజ్రీవాల్ దేశ వ్యాప్తంగా వున్న జనం సమస్యల గురించి మాట్లాడితే ఏ మాత్రం తప్పు కాదు. మోదీని విమర్శించినా తప్పు కాదు. కాని, ఆయన గమనించాల్సింది ఒక్కటుంది. ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలని పాలించే ముఖ్యమంత్రులు సహా త్రిపుర లాంటి చిన్న రాష్ట్రాలని ఏలుతోన్న సీఎంల వరకూ ఎవ్వరూ అవసరానికి మించి పీఎంని తిట్టిపోయటం లేదు. కేవలం కేజ్రీవాలే మాత్రమే ఆయన నిర్ణయాలు మొదలు చదువు వరకూ అన్నిటిని తూర్పార పడుతున్నారు. దీని వల్ల ఖచ్చితంగా లాభం కంటే నష్టం ఎక్కువగా వుండే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికిప్పుడు టీవీల్లో హడావిడి కనిపించినా ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆశల్ని వదిలేసి కఠిన నిర్ణయం తీసుకునే వీలుంది!