మగమహారాజులపై కాసింత దృష్టి పెట్టాలి!
posted on Nov 16, 2022 9:30AM
గుర్తింపు మనిషికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మనిషి ఉనికిని మరింత విస్తృతం చేస్తుంది. ఇక్కడ సాధారణ మానవ ఉనికి గురించి మాట్లాడటం లేదు, ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకు ప్రస్తుతం ఎన్నో రకాల దినోత్సవాలు ఉన్నాయి. పేరెంట్స్ డే, చిల్డ్రెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఇలా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ప్రతిరోజుకూ దాని ప్రాధాన్యతను అనుసరించి వాటిని జరువుకుంటూ ఉంటారు. ఆ కోవలోనిదే మెన్స్ డే. నేషనల్ మెన్స్ డే అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు.
ఎందుకంటే…
ఈ సృష్టికి ఆడది ఎంత ముఖ్యమో మగవాడు కూడా అంతే ముఖ్యం. మహిళా దినోత్సవాన్ని ఎంతో విస్తృతంగా జరుపుకునే ఈ కాలంలో మగవారికి గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఖచ్చితంగా చేయాల్సిన పని. ఒకప్పుడు మగవాడి అజమాయిషీ ఎక్కువగా ఉన్న కాలంలో మగవాళ్లను విలన్లుగా చూసి, ఆడవారిని వారే అణిచివేస్తున్నారని వారి మీద విమర్శనాస్త్రాలు సంధించిన వారు చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మగవాళ్ళు ఆడవారికి మద్దతు ఇస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, లక్ష్యాలు, క్రీడలు ఇలా ఎన్నో ఆడవారు మగవారితో సమానంగా రాణిస్తున్న రంగాలు ఉన్నాయి. అయితే ఇది కేవలం ఆడవారి గెలుపా… అంటే కాదని చెప్పవచ్చు. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉన్నట్టు, ప్రతి మహిళ విజయానికి మగవాడి తోడ్పాటు, మగవాడి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మగవారిని గౌరవించాలి, వారికి గుర్తింపు ఇవ్వాలి.
నవంబర్ 19 వ తేదీ నేషనల్ మెన్స్ డే. ప్రతి సంవత్సరం ఈ మెన్స్ డే ఉన్నా.. ఉమెన్స్ డే అంత ఆర్భాటాలు ఏవి మెన్స్ డే కి జరగడం లేదని గగ్గోలు పెడుతున్నవారు ఉన్నారు. సహజంగానే మహిళలు కాస్త హైలైట్ అవుతూ ఉంటారు అన్ని విషయాలలో… దానికి అనుగుణంగా మొదటి నుండి మహిళలు అణిచివేయబడిన వర్గంలో ఒక భాగమయ్యారు కాబట్టి వారికి స్వతహాగానే తమకంటూ ప్రత్యేకత ఉందని వ్యాప్తం చెయ్యాలని ఉంటుంది. దానికి తగ్గట్టే మహిళా సంఘాలు, మహిళ సదస్సులు, మహిళా విభాగాలు ఏర్పడ్డాయి. అయితే మగవారికి ఇలాంటివి ఏమి లేవు. అందుకే మెన్స్ డే ని ప్రత్యేకంగా ఆర్భాటంగా జరిపేవాళ్ళు కనిపించరు.
కానీ…. ఏం చేయచ్చు??
మెన్స్ డే అనేది ప్రపంచం మొత్తం మీద మగవారిని గుర్తించి వారికేదో సన్మానాలు గట్రా చేయాలని కాదు అర్థం. మగవారికి కూడా కాసింత ప్రాముఖ్యత ఇవ్వాలని. ఇక్కడేం తక్కువయ్యింది వాళ్లకు అనే ప్రశ్న మళ్ళీ వొస్తుందేమో…
ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నా చాలా శాతం కుటుంబాలకు మగవారు బాధ్యత వహిస్తూ ఉంటారు. దీని కారణంగా మగవారు తమ ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ గురించి తక్కువగానే ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి కుటుంబంలో మగవారి ఆరోగ్యం, వారి మానసిక పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలు, ఒత్తిడి వంటి విషయాల గురించి దృష్టి సారించడం ఈ మెన్స్ డే రోజు చేయవచ్చు. ఇది ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఈరోజే ఎందుకనే ప్రశ్న వస్తే అవగాహనకు తొలిమెట్టు అనేది అన్నిసార్లు జరగదు. దానికోసం ప్రత్యేకంగా సమయాన్ని, శ్రద్దను కేటాయించగలగాలి. అలాంటప్పుడే సాధారణ సమయాల్లో కంటే ఎక్కువ దృష్టి దాని మీదకు వెళుతుంది.
మగవారి ఆరోగ్యం, వారి క్షేమం ఉంటే ప్రతి ఇల్లూ కొన్ని భయాలు, భారాలకు దూరంగా హాయిగా ఉండగలుగుతుంది. అందుకే మగవారికి కేటాయించిన దినోత్సవాన్ని మిస్ కాకుండా సెలబ్రేట్ చేయండి..
◆నిశ్శబ్ద.