పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు ఈ ప్రశ్నలు వేసుకోవాలి..!


పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వెనుకటి కాలంలో పెళ్లి అంటే కేవలం పెద్దల నిర్ణయం. కానీ నేటి తరంలో పెళ్లి చేసుకునే వారిదే మొదటి, చివరి నిర్ణయం కూడా.. పెళ్ళి చేసుకోబోయే జంటలు పెళ్లికి ముందు ఒకరినొకరు కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. దీని వల్ల ఒకరినొకరు తెలుసుకోవడానికి వీలుంటుంది. దీని ఆధారంగా పెళ్లి గురించి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు.  ఇంతకీ పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే..

అంచనాలు..

పెళ్ళికి ముందు చాలామంది తమకు వచ్చే భాగస్వామి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఈ అంచనాల గురించి ప్రశ్నించుకోవడం చాలా మంచిది. ఇది ఎవరి ఆలోచన ఎలా ఉంది? ఎలాంటి లైప్ కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

పెళ్లి తర్వాత ఉద్యోగం..

భారతదేశంలో ఇంటి బాధ్యత చూసుకునేది మగవారే.. అందుకే వారికి ఉద్యోగం తప్పనిసరి. అయితే  అమ్మాయిలు చదువుకున్నా,  ఉద్యోగం చేస్తున్నాపెళ్లి తర్వాత ఈ పరిస్థితులు మారుతుంటాయి.  అందుకే పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా? అనే విషయాలు ముందుగానే చర్చించుకోవడం మంచిది. వివాహం తర్వాత వీటి గురించి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది.

బాధ్యతలు..

ఇంటి బాధ్యతలు, ఆర్థిక భాద్యతలు,  పిల్లల బాధ్యతలను ఎలా విభజించాలి? వాటిని ఇద్దరూ ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాలు కూడా పెళ్లికి ముందు చర్చించుకోవాలి.  దీని వల్ల ఇద్దరూ తమ బాధ్యత చక్కగా నెరవేర్చుకోగలరు.

ఆర్థిక ప్రణాళిక..

బాగస్వామి ఆర్థిక అలవాట్లు,  పొదుపులు, ఖర్చు విధానాలను అడిగి తెలుసుకోవాలి. ఎంత సంపాదన ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు వంటివి అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తర్వాత ఇద్దరూ ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది వివాహం తర్వాత గొడవలను, విబేధాలను రాకుండా ఉండటంలో సహాయపడుతుంది.

పిల్లల ప్లానింగ్..

పెళ్లి కాకుండానే పిల్లల గురించి మాట్లాడటం కాస్త విచిత్రం అనుకుంటారు అందరూ. కానీ నేటితరం వారు పిల్లల బాధ్యతను ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అందుకే ఎంత మంది పిల్లలను ప్లానింగ్ చేసుకోవాలి? పిల్లలను ఎప్పుడు కనాలి? పిల్లలను ఎలా పెంచాలి? పిల్లల బాధ్యతల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?  వంటి విషయాలు చర్చించుకోవాలి. ఇది భార్యాభర్తల బందాన్ని బలపరుస్తుంది.

వివాదాలు..

ప్రతి ఒక్కరికి కోపం, అసహనం,  చిరాకు, గొడవ,  సమస్య వంటివి ఎదురైనప్పుడు స్పందించే విధానం వేరుగా ఉంటుంది.  ఇలాంటివి ఎదురైనప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకోవాలి.  దీని వల్ల వివాహం తర్వాత గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పిరిష్కరించుకోవాలో ఇద్దరికీ అర్థం అవుతుంది.

కుటుంబ సంబంధాలు..

పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడం కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటవ్వడం. పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయి తమ అత్తమామలతో ఎలా ఉండాలి? ఎలాంటి అనుబంధం కోరుతున్నారు? వంటివి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇలా చేస్తే వివాహం తర్వాత ఎలాంటి విభేదాలు ఉండవు.

ఇష్టాలు, అయిష్టాలు..

కాబోయే భాగస్వామి ఇష్టాలు, అభిరుచులు,  అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు వంటివి పెళ్లికి ముందు తెలుసుకోవాలి.  వైవాహిక బంధం ఎక్కువగా ఒకరి ఇష్టమైనది మరొకరు చేయడం అనే పని ద్వారా బలపడుతుంది.  దీని పల్ల ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థం అవుతుంది.  అందుకే ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవాలి.

                               *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu