అధికారికి ఉండవలసిన గొప్ప లక్షణం ఇదే...

కరోతు కరటశ్శబ్దమ్ సర్వదా ప్రాంగణే వసన్, శశృణోతి బుధః ప్రీత్యా శృణోతి పిక భాషితమ్ ।

కాకులు ఎప్పుడూ అరుస్తూంటాయి. అందరూ వాటిని చూసి విసుక్కుంటారు. కాకి గోల అని కొట్టేస్తారు. అదే కోయిల ఒక్కసారి కూయగానే, ఆనందిస్తారు. కోకిల స్వరం కోసం చెవులు రిక్కిస్తారు. ఆఫీసులలోనూ, ఇతర సంస్థలలోనూ ప్రతి చిన్న విషయానికీ చిటపటలాడే అధికారి పరిస్థితి 'కాకి' పరిస్థితి అవుతుంది. అతడి మాటలను పట్టించుకోవటం మానేస్తారు. అతడు ఎప్పుడూ అరుస్తూ ఉంటే అతని కింద పనిచేసేవారు ఒకానొక నిర్లక్ష్య భావనలోకి జారిపోతారు. అది ఎలా ఉంటుంది అంటే…  'ఆ ఏదో అరుస్తాడులే' అని కూరలో కరివేపాకులా అతని మాటలను తీసిపారేస్తారు.

అంటే, ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమంటే… ఏ గౌరవం ఆశించి సదరు అధికారి తన ఆ అధికారాన్ని ప్రయోగిస్తాడో, ఆ గౌరవమే అధికారికి లభించటం లేదన్నమాట.

ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో దీనికి సంబంధించి  మరో విషయం ప్రస్తావించుకోవాలి. ఎప్పుడైతే వ్యక్తిలో అర్హత లేకున్నా, తాను ఉన్నతస్థానం ఆక్రమించాడన్న భావన కలుగుతుందో, అప్పుడు ఆ వ్యక్తిలో న్యూనతాభావం కలుగుతుంది. అందరూ తనని తక్కువగా చూస్తున్నారన్న ఆలోచన కలుగుతుంది. అందరూ తన గురించి మాట్లాడతున్నారని, హేళన చేస్తున్నారన్న భయం కలుగుతుంది. అంటే తనలో ఎలాంటి ప్రతిభ, తనున్న స్థానానికి తగిన అర్హత లేదని విషయం అతనికే స్వయంగా తెలుసు. అదృష్టమో… ఇతరుల రికమెండేషన్ తోనో.. లేదా తనకు వారసత్వంగా వచ్చిన స్థానంలోనో అతడు కూర్చుంటున్నాడు కానీ దానికి తనిఖీ అర్హత అతనికి ఉండదు. ఆ విషయం అతనికి అర్థమైతే… అటువంటప్పుడే అధికారి తన అధికారాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తాడు. కానీ తన కింద పనిచేసేవారు ఆ ధికారాన్ని నిర్లక్ష్యం చేస్తే అతడు భంగపడతాడు.

అధికారిలోని ఈ ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని కిందివారు సులభంగా అర్థం చేసుకుంటారు. దాన్ని మరింత ఎగదోస్తారు. ఇంకొందరు ఈ ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని తమకు అనువుగా ఉపయోగించుకుంటారు. అతడిని పొగడుతూ, అతడి ఆశ్రయం సంపాదిస్తారు. పబ్బం గడుపుకుంటారు. కాబట్టి, అందరూ అన్ని విషయాల్లో నిష్ణాతులు కాలేరన్న విషయం అధికారి గ్రహించాలి. తన స్థానాన్ని, ఆ స్థానం ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించే విచక్షణ ప్రదర్శించాలి. అప్పుడు అతడి అనర్హత కూడా అర్హతగా మారిపోతుంది. అతడికి అర్హత లేదని చులకనగా చూసేవారే, అతడి విచక్షణకు దాసోహం అంటారు. 

అహంకారంతో, అధికార ప్రయోగంతో సాధించ లేనిదాన్ని విచక్షణతో, వినయంతో సాధించవచ్చు. గమనిస్తే, పూర్వకాలంలో రాజులు అవసరమైతే, అట్టడుగున ఉన్నవారి ముందు మోకరిల్లి విజ్ఞానాన్ని గ్రహించిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. భృగుమహర్షి తన వక్షస్థలం మీద తన్నినా దాన్ని విష్ణుమూర్తి చిరునవ్వుతో స్వీకరించటం మనకు తెలుసు. తన శక్తిని అవగాహన చేసుకున్న వ్యక్తి ప్రవర్తన ఇలా ఉంటుంది. అందుకే అధికారి అన్నవాడు 'అర్హత' గురించి ఆలోచించటమూ, విచక్షణతో, వినయంతో 'నేర్చుకోవటమూ' నేర్చుకోవాలి. మంచి ఎక్కడ ఉన్నా గౌరవించటం నేర్చుకోవాలి.

                                         ◆నిశ్శబ్ద.

Related Segment News