నేటికాలంలో అధికారుల తీరు ఎలా ఉంది?

మనిషి ఎంతటి నీచుడైనా, పిరికిపంద అయినా, రాజసేవకుడైతే అతడిని ఎవరూ అవమానించలేరు. ఇది లోకరీతి, "నువ్వు గొప్ప పని సాధించకున్నా పరవాలేదు, గొప్పవాడి పక్కన నిలబడితే చాలు వాడి గొప్ప కొంత నీకూ అంటుకుంటుంది" అని ఓ సామెత ఉంది. అందుకే బలహీనులు, చేత కానివారు, స్వయంగా ఏమీ సాధించలేనివారు శక్తిమంతుడి చుట్టూ చేరాలని ప్రయత్నిస్తారు. శక్తిమంతుడి పంచన చేరి, అతడి శక్తి ద్వారా తమ పనులు సాధించుకోవాలని చూస్తారు. తమకు లేని గొప్పను ఆపాదించుకోవాలని చూస్తారు. అధికారి అహాన్ని సంతృప్తి పరచి, అతడి నమ్మకాన్ని పొందుతారు. ఆపై, అధికారి దగ్గర తమకున్న ప్రాబల్యాన్ని ప్రకటిస్తూ, ఇతరులను భయపెట్టి తమ ఆహాన్ని సంతృప్తి పరచుకుంటారు. ఇటువంటివారిని గుర్తించటం కష్టం. కానీ ఇటువంటి వారిని చేరదీయటం వల్ల అధికారి ఎంత మంచివాడైనా చెడ్డ పేరు సంపాదిస్తాడు.

పాలను గలసిన జలమును

బాల విధంబుననే యుండు, బరికింపంగా, 

బాల చవి జెరుచు, గావున 

బాలసుడగువాని పొందు వలదుర సుమతీ!

పాలతో కలిసిన నీరు పాలలాగే ఉంటుంది. కానీ పాల రుచిని పోగొడుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం వల్ల మంచి గుణాలు పోతాయి. కాబట్టి అంతరంగికులను ఎన్నుకునే విషయంలో అధికారి ఎంతో జాగరూకత వహించాల్సి ఉంటుంది.

సాధారణంగా ఆఫీసుల్లో పనివారిని రెండు రకాలుగా విభజించవచ్చు. పని చేయనివారు ఒక రకం. వీరితో పని చేయించటం బ్రహ్మతరం కూడా కాదు. పని చేసేవారు రెండో రకం. వీరిని పని చేయకుండా ఉంచటం బ్రహ్మతరం కాదు. అయితే పని చేయనివారిని మరి కొన్ని రకాలుగా విభజించవచ్చు. పనిచేయగలిగి చేయనివారు ఒకరకం. పని చేయలేక చేయనివారు ఇంకో రకం. అలాగే పనిచేసే వారిలో, ఎదుటివాడి గురించి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయేవారో రకం, తాము పనిచేస్తూ ఎదుటివాడు పని చేయటం లేదని ఏడుస్తూ పని చేసేవారు ఒక రకం, తమపనికి గుర్తింపు లభించటం లేదని బాధపడుతూ పనిచేసేవారు ఇంకో రకం. ఇటువంటి వారందరినీ వారివారి మనస్తత్వాలను అనుసరించి వ్యవహరిస్తూ నియంత్రించవచ్చు. కానీ..

ప్రమాదకరమైన ఇంకో రెండు రకాల పనివారున్నారు ఉంటారు.  వీరు పని చేస్తున్నట్టు నటిస్తారు, నమ్మిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. ఆఫీసర్ విశ్వాసం సంపాదించిన తరువాత ఎదుటివారిమీద పితూరీలు చెప్తారు. ఎదుటివారిని తక్కువ చేయటం వల్ల తమ ఆధిక్యాన్ని చాటుకుంటారు. మరో ప్రమాదకరమైనవారు, పనిచేస్తారు. కానీ పనిచేస్తూ వక్రకార్యాలకు పాల్పడుతారు. వక్రమార్గంలో ప్రయాణిస్తారు. తమ అక్రమచర్యల నుండి రక్షణ పొందేందుకు ఆఫీసర్ను ఆశ్రయిస్తారు. అతడికి సేవలు చేస్తారు. అవసరమైనవి అడగకుండానే అందిస్తారు. ఆఫీసరు అడుగులకు మడుగులొత్తుతారు. విశ్వాసం సంపాదిస్తారు. తద్వారా తమ పనులు సాధించుకుంటారు.

ఈ రెండు రకాల మనుషుల వల్లా అధికారికి చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇటువంటివారే అధికారులకు దగ్గరవటం జరుగుతుంది. ఎందుకంటే, పని చేసేవాడికి స్వతహాగా ఉండే ఆత్మవిశ్వాసం వల్ల వాడు ఎవరి ప్రాపు సంపాదించటానికీ ఇష్టపడడు. తనను ప్రజలు గుర్తించాలని ఆరాటపడకుండా రత్నం ఎలా భూమిలోనే ఉండిపోతుందో, అలా వీరు కూడా ఆఫీసర్ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇందుకు భిన్నంగా, ఆఫీసరు దృష్టిని ఆకర్షించాలని, దగ్గరవ్వాలని ప్రయత్నించే వారికి స్వలాభాలుంటాయి, ఉద్దేశ్యాలుంటాయి.


 కానీ అధికారిలో ఉన్న అహం, తన ప్రాపు కోసం తాపత్రయపడేవారిని చూసి సంతృప్తి చెందుతుంది, వారే ఇష్టులవుతారు. తమని లెక్క చేయని పనివారంటే ఆఫీసర్లో కోపం కలుగుతుంది. అతడి అహం దెబ్బ తింటుంది. తన చుట్టూ చేరినవారి ప్రభావంతో, తప్పు అని తెలిసి కూడా, పని చేసేవారిని బాధించాల్సి వస్తుంది. చెడ్డ పేరు మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది నేటికాలంలో అధికారుల తీరు.


                                     ◆నిశ్శబ్ద.

Related Segment News