గులాబీ అధినేత గుబులు

సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగంపై కీలక చర్చ జరిగిందని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ లైన్ దాటడంతో పాటు గులాబీ దళానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించటంపై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయి. అయితే దీనిని కేసీఆర్ పలు సందర్భాల్లో కొట్టిపారేశారు. పైకి కేసీఆర్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం ఎన్నికల్లో మరోసారి విజయం అంత సాధ్యం కాదని తేలిపోయింది. దీనికి కారణం నేతలు డిసిప్లైన్ తప్పటమే. అందులో భాగంగానే అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజలను వేధించటం. వీటన్నింటిపై కేసీఆర్ ఈ సమావేశంలో ఓ లుక్కేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. నేతల మధ్య సవాళ్లతో వాతావరణం వేడెక్కిపోతోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటూ ప్రచారం చేస్తూ.. టీఆర్ఎస్ నేతల్లో ధైర్యాన్ని చెదరగొడుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి అటు బండి సంజయ్, బీజేపీ నేతల మాటలతూటాలు పేలుస్తున్నారు. ఇవన్నీ టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ కార్డు ప్రకారం గులాబీ దండుకు 100కి పైగా స్థానాలు వస్తాయని కేసీఆర్ స్వయంగా చెప్పారు. టీఆర్ఎస్ నేతల తీరుతో ప్రజలకు తమపై అభిమానం సన్నగిల్లిందా అని కేసీఆర్ కే అనుమానాలు వస్తున్నాయని ప్రచారం. తాజాగా కామారెడ్డి ఘటన. టీఆర్ఎస్ నేతల అధికార అహంకారానికి సంతోష్, అతని తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీనివెనుక మా హస్తం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నా... సూసైడ్ తర్వాత ఓ రోజుపాటు కనిపించకుండాపోయి... అకస్మాత్తుగా వీడియో మెసేజ్ లు విడుదల చేశారు సదరు నేతలు. తమపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. పోలీస్ శాఖ మాత్రం తమదైన రీతిలో పరారీలో ఉన్న నేతలపై కేసులు బుక్ చేయడంతో పాటు స్పెషల్ టీంలతో గాలింపు చేపట్టామని ప్రకటించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని పోలీసు బాసులు గాంభీర్య ప్రకటనలు చేస్తున్నారు. 

అంతకుముందు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికార దాహానికి అతని కుమారుడు నిర్వాకం తోడుకావటంతో ఓ నిండుకుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఎట్టకేలకూ నిందితుడైన ఎమ్మెల్యే పుత్ర రత్నాన్ని అరెస్ట్ చేసి... నెల రోజులపాటు జైలులో ఉంచి విడుదల చేశారు. కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది... ఎమ్మెల్యే కొడుకు హస్తంపై మాత్రం పోలీసులు ఏం తేల్చలేకపోయారు. ఇదంతా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనుసన్నల్లో జరుగుతుందోని ప్రజల్లోకి వెళ్లిపోయింది. నష్టనివారణా చర్యలు చేపట్టకపోయినా... పార్టీకి మాత్రం డ్యామేజ్ వచ్చింది. తాజాగా ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికార దాహానికి బీజేపీ యువనేత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ కలిచివేసింది. కరోనా కష్టసమయంలో అండగా ఉండాల్సిన టీఆర్ఎస్ నేతలు.. కరోనాబారిన పడిన బీజేపీ యువనేతను అద్దె ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు యత్నించారు. అదేకాక పువ్వాడ భూ కబ్జాలు తాజా వ్యవహారంతో వెలుగులోకి వచ్చాయి. ఇంత జరిగినా సదరు మంత్రివర్యుడిపై చర్యలకు సీఎం కేసీఆర్ ఆదేశించకపోవటం గమనార్హం. 

ఇక ఇదే సమయంలో పార్టీల నేతల మధ్య పొసగటం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి జూపల్లికి విబేధాలు వచ్చాయి. ఇదే దారిలో అసమ్మతులు పలు జిల్లాల్లో వినిపిస్తున్నాయి. ఒకరిని కాపాడేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు... అది చివరికి పార్టీ మనుగడకు సమస్యగా మారుతోంది. నేతల ఆగడాలపై కేసీఆర్ ముందుగానే దిద్దుబాటు చర్యలు చేపడితే అది... గులాబీ దళానికి వరంగా మారేది. ఆ దిశగా కేసీఆర్ చర్యలు చేపట్టిన దాఖలాలు శూన్యం. పార్టీలో అసమ్మతుల తలనొప్పులు ఒకవైపేతే... బీజేపీ, కాంగ్రెస్ నేతల దూకుడు గులాబీ దళానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వచ్చే ప్రభుత్వం మాదేనని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అంటుంటే... ప్రజలు మా వైపు చూస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇదే సమయం అన్నట్టుగా గులాబీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇదంతా వెరసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. పార్టీలో చాలామంది నేతలు సమయం కోసం వేచిచూస్తూ... స్థానిక పరిస్థితులను బట్టి...బీజేపీ, కాంగ్రెస్ లోకి చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.