అమరావతి కోసం ఎంపీగా తన తొలి వేతనం విరాళం!

ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు. పార్టీ పట్ల ఆయన అంకిత భావాన్ని గుర్తించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి ఎన్నికలలో ఆయనను విజయనగరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీలో నిలిపారు.

ఆయన పేరు కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలి సారి లోక్ సభకు వెళ్లిన సమయంలో కూడా ఆయన పార్టీ జెండాను పట్టుకుని సైకిల్ పైనే వెళ్లారు. ఢిల్లీ వీధుల్లో ఆయన సైకిల్ పై లోక్ సభకు వెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  

అత్యంత సామాన్య కుటుంబ నేపథ్యం ఉన్న అప్పల నాయుడు లోక్ సభకు ఎన్నిక కావడం ఒకెత్తు అయితే.. ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం మరోఎత్తుగా చెప్పుకోవాలి. 

ఔను ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు లక్షా 57వేల రూపాయల చెక్కును ఆయన చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయన ను కలిసిన అప్పలనాయుడు ఆ చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎంపీలు కూడా ఉన్నారు. చంద్రబాబు అప్పలనాయుడిని అభినందించారు.

కాగా అప్పలనాయుడు ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని అమరావతికి విరాళంగా ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేసిన అప్పలనాయుడు ఆ తరువాత తెలుగుదేశం ఉత్తరాంధ్ర ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. పార్టీ పట్ల అంకిత భావం, విధేయతతో పని చేసిన అప్పలనాయుడి సేవలను గుర్తించిన చంద్రబాబు ఆయనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ అప్పలనాయుడు దాదాపు 2 లక్షల 50 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.