బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో భారీ చేరికలు
posted on Sep 29, 2023 2:52PM
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే కొందరు బహిరంగంగా ప్రకటించగా మరికొందరు ముహూర్తం కోసం వేచి ఉన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్ చొరవతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరికల విషయంలో చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక తరహా ఫార్ములాను అనుసరించాలని ఈ చర్చల సారాంశం. ఈ ఎన్నికల్లో సిక్స్ గ్యారెంటీస్ ప్రచారంతో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు మామూలే. ప్రస్తుతం అటువంటి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. అందరికంటే ముందే బిఆర్ఎస్ జాబితా ప్రకటించిన కేసీఆర్ అసంతృప్తి వాదుల మీద ఫోకస్ పెట్టకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలెక్కువయ్యాయి. బిఆర్ఎస్ లో రెండో శ్రేణి నేతల మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 17వతేదీన హైదరాబాద్ తుక్కుగూడ వేదికగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రజాకర్ష పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే తన కుమారుడు రాహుల్ తో ఎఐసీసీ అగ్ర నేత మల్లి ఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మల్కాజ్ గిరిలో తుక్కుగూడ తరహా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశానికి సోనియాగాంధీ పాల్గొనబోతున్నట్లు సమాచారం. అప్పుడు బిఆర్ఎస్ లో టికెట్ రానివారితో బాటు ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అనేక సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకంటున్నాయి.