ఈ సంక్షోభంలో తెలుగుదేశం పార్టీకి ధీమా, ధైర్యం భువనేశ్వరి, బ్రాహ్మణి!

అధికార వైసీపీ కుట్ర, కక్ష పూరిత విధానాల కారణంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్టయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కూడా జగన్ సర్కార్ కేసుల పేర వేధింపులకు గురి అవుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ ను ఏపీ సీఐడీ చేర్చింది. అయితే లోకేష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్పోజ్ చేసిన ఏపీ హై కోర్టు విచారణకు సహకరించాలని ఆయనను ఆదేశించింది. అరెస్టు అవకాశం లేదు అన్నదే లోకేష్ కు దొరికిన ఊరట. అయితే విచారణ పేరిట లోకేష్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కలిగించేలా ఏపీ సీఐడీ వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. స్కిల్ కేసులో గత 20 రోజులుగా చంద్రబాబును, ఆ అరెస్టు కారణంగా నారా లోకేష్ ను ప్రజలతో మమేకం కాకుండా నిలువరించిన జగన్ సర్కార్.. ఇక ముందు కూడా తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ప్రజల వద్దకు వెళ్లేందుకు అడ్డంకులు సృష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు అంతే కాలం విపక్ష నేతగా, గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో   ప్రతి మలుపులోనూ క్రియాశీలంగా వ్యవహరించిన, దార్శనికుడిగా దేశ, విదేశాల గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబును కనీసం నోటీసులు లేకుండా, చార్జిషీట్ లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసనలు, ఆగ్రహ జ్వాలలూ వ్యక్తం అవుతున్నా ఖాతరు చేయని జగన్ సర్కార్ కు వెనుక నుంచి కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా జగన్  భుజం మీద నుంచి  బీజేపీ అగ్రనాయకులు మోడీ, షాలు తుపాకి గురిపెట్టారని చెబుతున్నారు. వారు వ్యూహాత్మకంగా ఒకదాని వెంట ఒకటిగా అమలు చేస్తున్న కుట్రలలో భాగంగానే చంద్రబాబు అరెస్టు జరిగిందనీ, నారా లోకేష్  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో వచ్చే కొన్ని రోజుల వరకూ చంద్రబాబు, లోకేష్ ఇరువురూ కూడా ప్రజలతో మమేకమయ్యేలా పర్యటనలు చేసే అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు. 

ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించేందుకు, అలాగే చంద్రబాబు అరెస్టుపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ప్రజలను, పార్టీ శ్రేణులనూ వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు, అరెస్టుకు వ్యతిరేకంగా వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాలను జగన్ సర్కార్ పతనం దిశగా నడిపించేందుకు.. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఒక నేత అవసరం ఉందన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతున్నది. ఒకరు ముందు నిలబడితే.. తామే పార్టీని గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రహ్మణి రూపంలో పార్టీకి ముందుండి నడిపించగల నాయకత్వం లభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చంద్రబాబు అరెస్టుతో ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోని పలు దేశాలలో కూడా నిరసన జ్వాలలు ఎగసి పడ్డాయి. చంద్రబాబును నిర్బంధించి 20 రోజులు గడిచిపోయినా జనం ఆగ్రహావేశాలు ఇసుమంతైనా తగ్గలేదు సరికదా రోజు రోజుకూ ఇనుమడిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఏపీలో ఎమర్జెన్సీ స్థాయి నిర్బంధాలను కూడా లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. 

 అదే సమయంలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మనిలు రాజమహేంద్రవరం వేదికగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ కుటుంబ వ్యాపారం చూసుకోవడం తప్ప రాజకీయాలకు దూరంగా ఉన్న వీరిరువురూ ఇప్పుడు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వారిని కలిసి వారితో మాట్లాడుతున్నారు. రొటీన్ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా ఇరువురూ కూడా సూటిగా, ఎటువంటి తడబాటు, తొట్రుపాటు లేకుండా చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో, ఎంత అప్రజాస్వామికమో వివరిస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ధైర్యంగా ఎండగడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ, మేం ఉన్నామనీ పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. నేతలలో ధైర్యం నింపుతున్నారు. ఇరువురూ మాటలకే పరిమితం కాకుండా  చేతలలో కూడా కూడా పార్టీకి అండదండగా ఉంటామన్న ధైర్యాన్నీ, ధీమాను ఇస్తున్నారు. వారు మీడియాతో  మాట్లాడిన  సందర్భాలలో కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడుతూ పరిణితిని చాటుకున్నారు. 

 ప్రధానంగా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు.  ఆ సందర్భంగా మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఆమె సంక్షోభాలను అధిగమించి పార్టీని ముందుండి నడిపించగల సమర్ధ నాయకురాలిగా అందరిలోనూ విశ్వాసాన్ని కలిగించాయి.  రాజకీయాల్లో రాణించాలంటే ఉండాల్సిన పరిణితి, నిర్భీతి, నిష్కర్షగా మాట్లాడగలిగే వాగ్ధాటి ఉన్న నేతగా అంతా బ్రాహ్మణిని గుర్తించారు.  నారా బ్రాహ్మణి  తెలుగుదేశం తరఫున ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ఇదే సరైన తరుణమని పరిశీలకులు కూడా అంటున్నారు.   రాష్ష్ట్రంలో దుర్మార్గ పాలన గురించీ, జగన్ ప్రభుత్వ అరాచకత్వం గురించి ఆమె సామాజిక మాధ్యమంలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి.  ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నాయకులతో ఆమె చర్చలు జరుపుతున్నారు.  జనసేనతో పొత్తు సమన్వయానికి సంబంధించి కూడా ఆమె నేతలకు, శ్రేణులకూ దిశా నిర్దేశం చేస్తున్నారు. జనసేన నేతలతోనూ చర్చిస్తున్నారు.  అదే విధంగా నారా భువనేశ్వరి ప్రసంగాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  పార్ఠీ శ్రేణుల్ని ఉద్దేశించి ఆమె ప్రసంగాలు వారిని కదిలిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ఇద్దర్నీ బయటకు రాకుండా కేసుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినా  టీడీపీని  అత్తాకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మణి దిగ్విజయం దిశగా పార్టీని నడిపిస్తారని తెలుగుదేశం శ్రేణులు ధీమా, ధైర్యం వ్యక్తం చేస్తున్నాయి.