బీర్ఎస్ కు ఆంధ్రా సెటిలర్స్ దూరం.. ఇది కన్ఫర్మేనా?

జోష్ మీదున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని  ఇప్పటికే టెన్షన్ పెడుతున్నది. బీఆర్ఎస్ నేతలు పైకి గాంభీర్యంప్రదర్శిస్తున్నా రోజురోజుకీ బలోపేతం అవుతున్న కాంగ్రెస్ ఆ పార్టీని గాభరాపెడుతోంది.  నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో బలంగా ఉన్నట్లు కనిపించిన బీజేపీ..  ఇప్పుడు చతికిల పడింది.  దీంతో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు గంపగుత్తగా ఆ పార్టీకే దఖలు పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.  ఇప్పటికే పార్టీ మారిన కొందరు దిగ్గజ నేతలు సొంగ గూటికి అంటే హస్తం పంచకు చేరారు.  దీంతో బీఆర్ఎస్ లో  టెన్షన్ ఒకింత తీవ్రంగానే ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి కూడా బీఆర్ఎస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది.   

గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయంలో ఓ నాలుగైదు అంశాలు కీలక పాత్ర పోషించాయి. బీజీపీ, కాంగ్రెస్ మధ్య ఓటు బ్యాంకు చీలిపోవడం, ఆంధ్రా సెటిలర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడం, కాంగ్రెస్, టీడీపీ పొత్తు కలిసిరాకపోవడం, తెలంగాణ సెంటిమెంటును రగిలించడంలో కేసీఆర్ సక్సెస్ కావడం వంటివి ఆ అంశాలు అవే 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) కు అధికారాన్ని అందించి అందలం ఎక్కించాయి. అయితే ఇప్పుడు ఇందులో ఏదీ  బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ చతికిల పడింది. కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా దూసుకొచ్చింది. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారడంతో సెంటిమెంటుకు అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకుకు స్వయంగా బీఆర్ఎస్సే గండి కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును స్కిల్ స్కాం అంటూ ఏపీలోని జగన్ సర్కార్  అక్రమంగా అరెస్టు చేసిన  నేపథ్యంలో  తెలుగుదేశంతో పాటు  ఏపీ నుండి అమెరికా వరకూ  ప్రతి తెలుగువాడూ తీవ్రంగా స్పందిస్తున్నారు. స్వచ్ఛందంగా నిరసనలకు దిగుతున్నారు.  ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని చంద్రబాబు సానుభూతిపరులు, అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలోని ఉద్యోగులు, ఆంధ్రా మూలాలు ఉన్న సెటిలర్లు, టీడీపీ అభిమానులు పలువురు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు.    హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు వందలాది కార్లతో ర్యాలీ, ఫెనాన్షియల్ డిస్ట్రిక్ లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయటం వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై నిరసనల నేపథ్యంలో పలుచోట్ల తెలంగాణ పోలీసులు వారిని నిలువరించిన, వారిపై దౌర్జన్యం చేసిన  వీడియోలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.

అయితే, బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కొందరు చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాకుండా ఏపీ సీఎంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం.. బాబు అరెస్టుపై హైదరాబాద్ లో ఎందుకు నిరసనలు చేస్తారు?  కావాలంటే మీ రాష్ట్రం పోయి చేసుకోండి   అంటూ వ్యాఖ్యానించారు. తమకు చంద్ర‌బాబు కేసుకు సంబంధం ఏంట‌ని, ఇక్క‌డ ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు ఎలా అనుమ‌తులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో సోషల్ మీడియాలో  ఆయన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. బాబు గురించి హైదరాబాద్ లో ఎందుకు ఆందోళన అన్న మంత్రి కేటీఆర్ కు నెటిజన్లు ఏపీలోని తాడేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ  కార్యాలయం ముందు  సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. తాడేపల్లిలో  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. 

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి ధర్నాలు ఎందుకు చేసారో చెప్తారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఆంధ్రా టెన్షన్ మొదలైందా అనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణలో 5 శాతం ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకు ఉంటుందని అంచనా. వీరిలో ఎక్కువ శాతం తెలుగుదేశం  సానుభూతిపరులే . అది గమనించే ఇన్నాళ్లు కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తూ వచ్చారు. కానీ  ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో  కేటీఆర్ సెటిలర్ల ఆగ్రహానికి గురయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించడం, ఎల్బీ న‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఏకంగా ధర్నాలో పాల్గొనడం వంటి సంఘటనలు జరిగాయి. అయినా సరే ఏపీ గొడవ ఇక్కడెందుకు అంటూ  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే  బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ప్రతికూలంగా మారాయి.  అసలే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు కేటీఆర్ వ్యాఖ్యలు గోరు చుట్టుమీద రోకటి పోటులా మారియి.  బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో సెటిలర్ల వ్యతిరేకత  గట్టి ప్రభావమే చూపే అవకాశం ఉందని అంటున్నారు.