జేడీ సంచలన నిర్ణయం..!

నూతన విధి, విధానాలతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బుధవారం (నవంబర్ 29) విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయాలు భవిష్యత్తు నిర్ణయిస్తున్నప్పుడు.. భవిష్యత్తు రాజకీయాలను యువత నిర్ణయిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి యువత రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్త విధి, విధానాలు తీసుకు రావడం ముఖ్యమని.. వాటిని వచ్చే ఎన్నికల వేళ.. ప్రజల ముందుకు తీసుకు రావాలని.. అయితే పార్టీలు గెలవడం ముఖ్యం కాదని.. ప్రజలు గెలవడం ముఖ్యమని  స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రంలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫేయిర్‌కు 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని.. అర్హత గల యువతకు అక్కడే కంపెనీలు ఆఫర్ లెటర్  అందజేస్తాయని లక్ష్మీనారాయణ చెప్పారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరు కావచ్చని చెప్పారు.  కొంచె వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. 

మరోవైపు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ఆయన పలు వేదికల మీద.. వివిధ సందర్బాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఏ పార్టీ నుంచి అనే అంశంపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ   ఇవ్వ  లేదు. అలాంటి వేళ..   కొత్త పార్టీ స్థాపించి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని  జేడీ ఈ ప్రెస్ మీట్‌‌ ద్వారా చెప్పారని పరిశీలకులు భావిస్తున్నారు.  

గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన  అభ్యర్థిగా బరిలో దిగి.. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో ఓట్ల పరంగా ఆయన రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఆ తర్వాత పలు కారణాలతో ఆయన  జనసేనకు గుడ్ బై చెప్పారు. కానీ ఆయన తనదైన శైలిలో సమాజ సేవ చేస్తూ.. వివిధ సందర్భాల్లో యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తూ.. ఉత్తేజకర ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కెను కలిసి.. ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా.. యువత రాజకీయాల్లోకి రావాలని  ఆకాంక్షించారు. 

1990 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్ర కేడర్ అధికారి అయిన వివి లక్ష్మీనారాయణ.. 2018 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి.. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా వివి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.  ఆ క్రమంలో ఆయన పేరు.. జేడీ లక్ష్మీ నారాయణగా స్థిరపడిపోయింది.