టెన్షన్.. టెన్షన్..

తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గురువారం (నవంబర్ 30) జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) సర్వం సిద్దం చేసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం 35,655 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అలాగే వృద్దులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టింది.   

గురువారం ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ కోసం.. 375 ఆర్మ్‌డ్ సెంట్రల ఫోర్స్ కంపెనీ సిబ్బందితోపాటు 50 వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగించనున్నారు. తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను నవంబర్ 28వ తేదీ సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంచుతున్నారు. అదే విధంగా ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 

అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు స్థానాలు... గజ్వేలు, కామారెడ్డి నుంచి బరిలో దిగగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కోడంగల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలో నిలిచారు. మొత్తంగా గులాబీ బాస్ కేసీఆర్‌ను ఓడించేందుకు అటు హస్తం పార్టీ అధ్యక్షుడు, ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల కంకణం కట్టుకున్నారనే  ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఉపందుకొంది. 

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. గత ఎన్నికల్లో అంబర్ పేట నుంచి బరిలో దిగిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది.. మోదీ కేబినెట్‌లో మంత్రిగా చోటు సంపాదించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి.. ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించడంతో..  అసంతృప్తి వ్యక్తం చేసిన రాములమ్మ..   కాషాయం పెద్దల నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీకి రాం రాం చెప్పి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. ఇక కరీంనగర్ ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. అదే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.    

అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. ఆయన సైతం ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం.  

ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. ఆ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి ఆయన గెలుపొందారు. మళ్లీ ఆయన అదే స్థానంతోపాటు కేసీఆర్ బరిలో దిగిన గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు.  అలాగే ఐపీఎస్ అధికారి.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి. సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముచ్చటగా మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని ఎవరు కైవసం చేసుకొంటారనే ఓ విధమైన టెన్షన్.. ఆ యా పార్టీల అధినేతల్లోనే కాదు.. ఇటు ప్రజల్లో సైతం టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు, రెబల్స్ బెడద అన్ని రాజకీయ పార్టీలను  ఇబ్బంది పెడుతోంది. వీరితో ఓట్లు భారీగా చీలి.. ఓటమి పాలవుతామనే ఓ విధమైన బెంగ.. వివిధ రాజకీయ పార్టీల నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

మరోవైపు... తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. ముచ్చటగా మూడోసారి కూడా కారు పార్టీకే ప్రజలు పట్టం కడతారా? లేకుంటే... కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చేతులెత్తి జై కొడతారా? అదీ ఇది కాదు.. కాషాయం పార్టీని ఆదరిస్తారా? అంటే.. అందుకు జవాబు మాత్రం డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా ప్రజా నాడి బహిర్గతం కానుంది.