జేసీకి అసలేమైంది? ఎందుకలా మాట్లాడారు?

 

జేసీ దివాకర్ రెడ్డి... ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ పొలిటీషియన్... సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసి... కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డ జేసీ... రాష్ట్ర విభజన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి....2019వరకు ఎంపీగా పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత జేసీ ప్రాధాన్యత కొంత తగ్గినా... ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం చక్రం తిప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు జేసీకి ఒక వాల్యూ గుర్తింపు ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మంత్రి పదవినైనా దక్కించుకునేవారు... లేదంటే ప్రభుత్వంలో పలుకుబడి అయినా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా తన స్టైల్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే, జేసీ దివాకర్ రెడ్డి ఎలాంటి భయం బెరుకూ లేకుండా తాను చెప్పదలుచుకున్నది చెప్పేస్తారు. అందుకే జేసీ ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. తిట్టడంలోనైనా, పొగడటంలోనైనా జేసీ స్టైలే వేరు. ఉన్నదున్నట్లు మాట్లాడతారో లేదో చెప్పలేం కానీ, తాను అనుకున్నది మాత్రం కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు.

అయితే, ఏపీ సీఎం జగన్ పై ఎప్పుడూ విమర్శనాస్త్రాలు సంధించే జేసీ దివాకర్ రెడ్డి.... ఈసారి కాస్త భిన్నంగా మాట్లాడారు. వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తాను చేయాలనుకున్నది ధైర్యంగా చేస్తారని అన్నారు. అయితే, జగన్ లాగా చంద్రబాబు ధైర్మమున్న లీడర్ కాదన్నారు. అయితే, జగన్ ను పొగిడినట్టే పొగిడి తనదైన శైలిలో విమర్శలు కూడా చేశారు. జగన్ ప్రభుత్వానికి.... రెడ్డి రాజ్యంలో కక్ష పాలన అని పేరు పెట్టాలంటూ చురకలు వేశారు. జగన్ తన తాత రాజారెడ్డిని మరిపిస్తూ పాలన చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే, జేసీ వ్యాఖ్యలను అర్ధంచేసుకోలేక వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అసలు జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడుతున్నారా? లేక తిడుతున్నారో తెలియక తికమకపడుతున్నారు. ఒకపక్క పొగుడుతూనే, మరోపక్క సెటైర్లు వేయడం వెనుక మతలబు ఏంటని మాట్లాడుకుంటున్నారు. అయితే, జేసీ దివాకర్ రెడ్డి వ్యూహాత్మకంగానే అప్పుడప్పుడూ పొగడ్తలు... అప్పుడప్పుడూ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.