ప్రకాశం జిల్లాలో సీమ ఫార్ములా..! టీడీపీ నేతలే టార్గెట్ గా క్వారీల్లో తనిఖీలు

 

రాయలసీమలో ప్రత్యర్ధులను దెబ్బకొట్టాలంటే ముందుగా ఆర్ధిక మూలాలపై గురిపెడతారు. పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తారు. చీనీ చెట్లను నరికేస్తారు. అలా, ఆర్ధికంగా దెబ్బకొట్టి ఆ తర్వాత ప్రత్యర్ధులను దారిలోకి తెచ్చుకుంటారు, లేదంటే అటాక్ చేస్తారు. అయితే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములాను తన రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తున్నారనే మాట వినిపిస్తోంది. రివర్స్ టెండరింగ్ కానీ, గత టీడీపీ పాలనపై అవినీతి ఆరోపణలు గానీ, అమరావతిపై గందరగోళం కానీ... ఇవన్నీ రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకేనన్న ప్రచారం ఉంది. ఇవన్నీ పరోక్షంగా జరుగుతున్న కక్ష సాధింపు చర్యలైతే... మరికొందర్ని డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు అలాంటివేనంటున్నారు. టీడీపీ నేతలే టార్గెట్ గా గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మొన్నటిమొన్న అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి క్వారీలపై వరుసగా వాంరోజులపాటు విజిలెన్స్ రైడ్స్ జరగగా, ఇప్పుడు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టార్గెట్ గా తనిఖీలు జరుగుతున్నాయి. శిద్ధాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్న క్వారీల్లో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ మైన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు.
 
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శిద్ధాతోపాటు అతని బంధువర్గానికి గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గెలాక్సీ గ్రానైట్ చీమకుర్తిలోనే లభిస్తుంది. దాంతో, ఇక్కడి గ్రానైట్ కు మాంచి డిమాండ్ ఉంది. అయితే, జగన్ సర్కారు వచ్చాక, కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని, చీమకుర్తి అండ్ బల్లికురవలో దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అధికారంలో ఉన్నా లేకున్నా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దూరంగా ఉంటే శిద్ధా క్వారీల్లో కూడా సోదాలు జరగడంపై చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా రాజకీయ దురుద్దేశాలతోనే జగన్ ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ అంటోంది. అయితే ఇదే ధోరణి కొనసాగితే మాత్రం గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని, అదే జరిగితే వేలమంది కార్మికులు రోడ్డునపడతారని హెచ్చరిస్తున్నారు.