కేకేకు కేసీఆర్ కు దూరం పెరిగిందా? రెన్యువల్ దక్కుతుందా? లేదా?
posted on Dec 14, 2019 11:55AM
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు పదవీ కాలం త్వరలో ముగియనుంది. దాంతో, తన రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయాలని కేకే కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు సన్నిహితుడు కావడంతో రెన్యువల్ చేయాలని స్వయంగా కోరినట్లు తెలుస్తోంది. అయితే, కేకే విషయంలో రకరకాల ఊహాగాలు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్ కి కేకేకు మధ్య దూరం పెరిగిందని, రెన్యువల్ దక్కకపోవచ్చని అంటున్నారు. ఇంకొందరైతే... మళ్లీ కేశవరావుకే ఇస్తారని అంటున్నారు. అయితే మరో మాట కూడా వినిపిస్తోంది. కేకే విషయంలో కేసీఆర్ మరో ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. కేకేను మళ్లీ రాజ్యసభకు పంపడం కేసీఆర్ కు ఇష్టం లేదని, ఈసారి రాష్ట్రస్థాయిలో కేకే సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. కేకేను ఎమ్మెల్సీని చేసి, కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెడతారని మాట్లాడుకుంటున్నారు.
అయితే, కేకే విషయంలో ఇలా ఊహాగానాలు చెలరేగడానికి ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన ఇన్సిడెంటే కారణమంటున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఆనాడు మీడియాకి లేఖ విడుదల చేయడంతోపాటు చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ కేకే చెప్పడం కలకలం సృష్టించింది. మొదట్లో కేసీఆర్ ఆదేశాలు సూచన మేరకే కేశవరావు ఈ ప్రకటర చేశారని ప్రచారం జరిగినా, అందులో వాస్తవం లేదని తేలింది. కేసీఆర్ ప్రమేయం లేకుండానే, పార్టీని సంప్రదించకుండానే కేకే ఆ ప్రకటన చేసినట్లు తేలడంతో అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. అప్పుడే కేకేకు అక్షింతలు పడ్డాయని, ఆ తర్వాతే కేశవరావు నోరు మెదపకుండా ఆగిపోయారని అంటారు.
అప్పట్నుంచి కేసీఆర్ కి, కేకేకి మధ్య దూరం పెరిగిపోయిందని, అందుకే, కేకే రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసే ఉద్దేశం కేసీఆర్ కి లేదని అంటున్నారు. ఒకవేళ అదే నిజమై... రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేయకపోతే కేకే ఎలా రియాక్ట్ అవుతారు? పార్టీ అధినేత నిర్ణయానికి విధేయత చూపుతారా? లేకపోతే అసమ్మతి జెండా ఎగురవేస్తారో? తెలియాలంటే కొద్దిరోజులు ఆగ్సాల్సిందే.