ఆమె మరణంతో తప్ప... అన్నిటితో గెలిచింది!


ఆమె విధితో పోరాడింది. విజయం సాధించింది! వీధుల్లో ప్రతిపక్ష రౌడీలతో పోరాడింది. విజయం సాధించింది! సినిమా రంగాన్ని జయించింది. రాజకీయ రణరంగంలో స్వైర విహారం చేసింది. పుట్టింది మొదలు అడుగడుగునా అపజయాన్ని అణిచేస్తూ అపర కాళికలా అవతరిస్తూ వచ్చింది. అయినా కోట్లాది తమిళ జనానికి ఆర్ద్రత నిండిన అమ్మై... అన్నీ తానైంది! శత్రువులకి నిద్దుర లేకుండా  చేస్తూనే... తనని నమ్మిన వారి కంటి నిండా నిద్దురైంది! కాని, జీవితంలో తొలిసారి ఓటమి అంగీకరించిన జయలలిత శాశ్వత నిద్దురలోకి జారుకుంది! డిసెంబర్ 5, సోమవారం నాటి మరణంతో తప్ప... ఆమె అన్నిటితో గెలిచింది!


సెప్టెంబర్ నుంచీ చెన్నై అపోలో హాస్పిటల్ లోనే వుంటూ వచ్చిన జయలలిత తుది శ్వాస విడవటంతో తమిళనాడు కన్నీటి సముద్రమైపోయింది. ఆమె మరణ వార్త వెలువడ్డ మరుక్షణం నుంచీ  మెరీనా బీచ్ లో జయలలిత అంత్యక్రియలు పూర్తయ్యే దాకా జనం రోడ్లపై ఉప్పొంగారు. ఏడుస్తూనే అమ్మకు అంతిమ వీడ్కోలు పలికారు. ఒకవైపు తమిళ , జాతీయ మీడియా కవరేజ్, మరో వైపు రాష్ట్రపతి, ప్రధాని సహా వీవీఐపీల శ్రద్ధాంజలులతో దేశం మొత్తం చెన్నై వైపే దృష్ఠి సారించింది! రాజకీయ రంగ ప్రముఖులు, సినిమా వాళ్లు జయ అంతిమ దర్శనం కోసం క్యూలు కట్టారు. ఇక లక్షలాది సామాన్య జనం గురించైతే చెప్పగలిగేదే లేదు... తమిళ నేల కూడా అమ్మ అస్తమయంతో కన్నీరు మున్నీరైందా అన్నట్టు జనం వరదై ఉప్పొంగారు... 


తమిళ చరిత్రలోనే అతి కొద్ది చారిత్రక ఘట్టాలతో పోల్చదగ్గ మహా జ్ఞాపకంగా సాగిన జయ మహాప్రస్థానం మెరీనా బీచ్ లో అంతమైంది. అడుగడుగునా జన సంధ్రం వీడ్కోలుతో ఆమె అంత్యక్రియలు సముద్ర తీరంలో ముగిశాయి. ఆమె రాజకీయ ప్రవేశానికి మూల కారకుడు, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమె సేద తీరారు. సినిమా రంగం, రాజకీయం రంగంల్లో కలిసి పయనించిన వారు మరో లోకంలోనూ తప్పక కలుసుకుంటారని అన్నా డీఎంకే అభిమానులు కన్నీటి పర్యంతం అవుతూ మనసుల్ని సమాధానపరుచుకున్నారు. 


డిసెంబర్ 6, మంగళ వారం నాడు... ఒక శకం ముగిసింది! జయలలిత అనే దిగ్విజయ శకం!      

 


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu