నిడదవోలులో వైసీపీకి చెక్.. జనసేన స్కెచ్

ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఛైర్మన్ పీఠం

నిడదవోలు మునిసిపాలిటీలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. కౌన్సిల్‌ సభ్యులు ఎత్తుకు పైఎ త్తులు వేస్తున్నారు. ఎలాగైనా సరే చైర్మన్‌ కుర్చీని కైవశం చేసుకోవాలని అటు వైసీపీ,  వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇది లా ఉండగా గురువారం (ఏప్రిల్ 3)  మునిసిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నిడదవోలు మునిసిపాలిటీలో 28 వార్డులకు 2021 మార్చి 15వ తేదీన ఎన్నికలు జరగగా 27 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక వార్డులో మాత్రమే తెలుగుదేశం విజయం సాధించింది. దీంతో నిడదవోలు కౌన్సిల్‌ వైసీపీ వశమైంది. ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మె ల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు చైర్మన్‌ పదవీ కాలాన్ని పంచుకునేలా ఒప్పందం కుదిర్చారు. మొదటి రెండున్నరేళ్లు మునిసిపల్‌ చైర్మన్‌గా భూపతి ఆదినారాయణ, తరువాత రెండేళ్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ తరువాత మిగిలిన కాలం పువ్వల రతీదేవి చైర్మన్‌గా  ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనివాస్‌ నాయుడు ఓటమి పాలయ్యారు. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు,  చైర్మన్‌ భూపతి ఆదినారాయణకు మధ్య ఉన్న ఆర్థిక, ఆంతరంగిక వ్యవహారాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో భూపతి ఆది నారాయణతో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో చైర్మన్‌ ఒప్పందం వివాదం ముదిరి పాకాన పడింది. మునిసిపల్‌ కౌన్సిల్‌ ఏర్పడి ఈ నెల 18వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తవడంతో అవిశ్వాస తీర్మానానికి అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్‌ పి.ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీవో రాణిసుస్మితలకు  వినతిపత్రం అందజేశారు.  చైర్మన్‌ పై అవిశ్వాసానికి తమకు అవకాశం ఇవ్వా లంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు పెట్టారు.ఈ నేపథ్యంలో నిడదవోలులో ఎటు చూసినా చైర్మన్‌ కుర్చీపైనే చర్చ సాగుతోంది.

తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. దీనితో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు సంఖ్య 28గా ఉంటే..  వైసీపీ నుంచి గెలిచిన 27 మందిలో ఇప్పటి వరకు 12 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ సంఖ్య 16కు తగ్గింది. ఒక  టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. 

జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం లభిస్తుంది.  వీరికి తోడు కౌన్సిల్ లో  టీడీపీకి ఒక సభ్యుడు ఉన్నారు. దీనితో జనసేన బలం 16,  వైసీపీ బలం కూడా పదహాగా ఉంది. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన.. వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.