కాల్పుల్లో లష్కరే తొయిబా కీలక ఉగ్రవాదులు హతం...
posted on Oct 14, 2017 12:22PM

జమ్మూకాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలంరేగింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పుల్వామాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. దీంతో అప్రమత్తమైన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ)కి చెందిన కీలక ఉగ్రవాది వసీమ్ షాతోపాటు మరో ఉగ్రవాది హషీజ్ నిసార్ హతమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా ధ్రువీకరించారు. ఎదురుకాల్పులు జరిపిన ప్రదేశం నుంచి ఒక ఏకే-47, ఏకే-56, ఆరు ఏకే మ్యాగజైన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని రాజకీయ నేతలు, భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో వసీమ్ కీలక పాత్ర పోషించినట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ వెల్లడించారు.