బీహార్ రియాక్షన్ ఏపీ బీజేపీ మీద ఎలా వుంటుందో!



పాపం బీజేపీ... చూస్తూ వుండగానే ఎలా అయిపోయింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా రాజాలాగా వెలిగిన మోడీ ప్రభ ఒక్క బీహార్ ఎన్నికలతో ఎంత తగ్గిపోయిందని జనం అనుకుంటున్నారు. ఏ రంగంలో అయినా ఎవరి హవా అయినా ఎల్లకాలం నడవదనేదానికి ‘మోడీ హవా’నే ఒక పెద్ద ఉదాహరణ అంటున్నారు. తాజాగా బీజేపీ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే బీహార్ ఎన్నికలకు ముందు... బీహార్ ఎన్నికలకు తర్వాత అనే రెండు విభాగాలు చేయవచ్చని రాజకీయ  పరిశీలకులు అంటున్నారు. బీహార్ ఎన్నికల ముందు కాలర్ ఎగరేసుకుని తిరిగిన బీజేపీ నాయకులకు ఇప్పుడు ఆ అవకాశం లేకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, దేశంలో తమ పార్టీకి బోలెడంత ఆదరణ వుందని, తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా నడుస్తుందని అనుకునే ధోరణి లేదని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ డల్లయింది. మరి ఏపీలో పరిస్థితి ఎలా వుండే అవకాశం వుంది.. బీజేపీ రియాక్షన్ ఏపీ మీద ఎలా వుండబోతోందో!

ఏపీలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ మిత్రపక్షం. అధికారంలో కూడా  భాగస్వామి. అయితే ఏపీలో బీజేపీని అధికారంలో వున్న ప్రతిపక్షం అనవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికారంలో భాగస్వామిగా వున్నప్పటికీ బీజేపీ నాయకులు అధికార పార్టీ మీదే వివాదాస్పద కామెంట్లు చేస్తూ వచ్చారు. ఆర్థికంగా అష్టకష్టాల్లో వున్న ఏపీని గట్టెక్కించాలంటే కేంద్రంతో స్నేహంగా వుండాలని చంద్రబాబు మౌనం వహిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు ఆ మౌనాన్ని అసమర్థతగా భావించే స్థితికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ హవా విపరీతంగా నడుస్తోందన్న ధీమానే ఈ ధోరణికి కారణమని అంటున్నారు. అయితే ఇప్పుడు బీహార్‌ ఫలితాలు ఏపీ బీజేపీలో కూడా మార్పు తెచ్చే అవకాశం వుందని అంటున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తే టీడీపీతో స్నేహం తెగిపోయే ప్రమాదం వుందనే భయం ఇప్పుడు ఆ పార్టీలో పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో అధికారంలోకి వచ్చేయాలన్న ఏపీ బీజేపీ కల కూడా చెదిరిపోయే అవకాశం వుందంటున్నారు. బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్ కావడంతో ఏపీలో ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన కుల రాజకీయాలను పునస్సమీక్షించుకునే అవకాశం వుందని అభిప్రాయ పడుతున్నారు. పాపం బీజేపీ... ఒక్క ఎన్నికల దెబ్బకి ఎంతగా మారిపోవలసి వస్తోందో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu