ప్రత్యేక హోదా పై జగన్ పోరాటాలు సమాప్తం?

 

జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి ఎంత అకస్మాత్తుగా పోరాటాలు మొదలుపెట్టారో అంతే అకస్మాత్తుగా వాటికి ముగింపు పలికేసినట్లున్నారు. చాలా అవమానకర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన నిరాహార దీక్ష ముగించవలసి వచ్చినప్పుడు వైకాపా నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ తదితరులు ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడి అమరావతికి వచ్చే ముందు రోజు వరకు వైకాపా నేతలు కొంచెం హడావుడి చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటన చేయకుండా వెళ్ళిపోయినా తరువాత వైకాపా నేతలు రెండు మూడు రోజుల పాటు యధాప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఆ తరువాత మళ్ళీ ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు. వైకాపాకు ఊదే దాని బాకా మీడియాలో కూడా ఇప్పుడు ‘ప్రత్యేక హోదా’ అనే మాట వినపడటం లేదు.

 

ప్రత్యేక హోదా కోసం మొదలుపెట్టిన పోరాటం ఫ్లాప్ అవడంతో తరువాత మళ్ళీ రాజధాని భూసేకరణపై పోరాటాలు మొదలుపెట్టాలనుకొన్నారు. జగన్ వెళ్లి అక్కడి రైతులను కలిసి వచ్చేరు కూడా. కానీ మళ్ళీ ఎందుకో దానిపైన వైకాపా వెనుకంజ వేసినట్లు కనబడుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని అటక ఎక్కించేసారు...భూసేకరణపై పోరాడబోవడం లేదు...బస్సు చార్జీల పెంపుపై పోరాడటం పూర్తయిపోయింది కనుక మళ్ళీ తమ పోరాటాలు కొనసాగించడానికి అటువంటి మరో బలమయిన అంశం లేదా సమస్య కోసం వైకాపా నేతలు వెతుకుతున్నట్లున్నారు. ఈ పరిణామాలన్నీ ఇంతకు ముందు ఊహించినవే. వైకాపా పోరాటాలు కొనసాగించడానికి ‘మెటీరియల్’ అందించాల్సిన బాధ్యత మాత్రం అధికార తెదేపా పార్టీదే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu