నరసింహన్ 69వ బర్త్ డే... కానీ...
posted on Nov 4, 2015 1:55PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బుధవారం నాడు మామూలుగానే రాజ్‌భవన్లో జరిగే పుట్టినరోజు వేడుకల్లో గవర్నర్ కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. ఇంకా మామూలుగానే చాలామంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని, ఇంకా బోలెడన్ని పదవులు అధిష్ఠించాలని కోరుకుంటారు. పుట్టినరోజు సందర్భంగా వీలయితే గవర్నర్ గారు సతీ సమేతంగా ఏ దేవాలయానికో వెళ్ళి భగవద్దర్శనం చేసుకుంటారు. అంతా బాగానే వుందిగానీ... పాపం ఆయన మనసులో పుట్టినరోజు జరుపుకుంటున్నానన్న ఆనందం వుండి వుంటుందా అనేదే సందేహం. ఎందుకంటే గవర్నర్‌గా ప్రతిష్ట బాగా మసకబారిపోయిన తర్వాత జరుపుకుంటున్న పుట్టినరోజు ఇది కాబట్టి.
పోలీసు ఉద్యోగిగా ఉన్న సమయంలో సూపర్ ఆఫీసర్ అనిపించుకున్న ఆయన గవర్నర్‌గా అయిన తర్వాత మాత్రం సరైన పనితీరును ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలోగానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గవర్నర్‌గా విధి నిర్వహణలో ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన వివక్ష ధోరణి ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ ప్రక్రియలకు సంబంధించి సంప్రదించడం తప్ప తప్ప ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా గౌరవం లభిస్తున్నదేమీ లేదు. ఒక రాష్ట్రం మొత్తానికీ మానసికంగా దూరమైపోయిన గవర్నర్‌గా ఆయన వున్నారు. ఇది ఏ గవర్నర్‌కయినా కొంత ఇబ్బంది కలిగించే విషయమే. నరసింహన్ కూడా దానికి అతీతుడేమీ కాదు... అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు హ్యాపీ బర్త్ డే.