చేసేది రైతుల కోసం దీక్ష! కానీ కనేది ముఖ్యమంత్రి కలలు

 

జగన్ కి ముఖ్యమంత్రి అయిపోవాలని చాలా బలమయిన కోరిక ఉంది. అది తరచూ అతని ప్రసంగాలలో చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంటుంది. ఈరోజు విజయవాడలో ఆయన చేప్పట్టిన దీక్షలో కూడా మూడేళ్ళలో తెదేపా ప్రభుత్వం కూలిపోతుందని తరువాత తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. కానీ తను ముఖ్యమంత్రి అవడం కోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం చాలా విస్మయం కలిగిస్తుంది. అయితే మూడేళ్ళ తరువాత ప్రభుత్వం ఏవిధంగా కూలిపోతుందో, తను ఏవిధంగా తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానని భావిస్తున్నారో ఆయన చెప్పి ఉండి ఉంటే బాగుండేది.

 

కానీ ఆయన ఒక సమస్యపై పోరాటం చేస్తున్నప్పుడు తన ముఖ్యమంత్రి స్వప్నాన్ని ప్రజల ముందు ఉంచుతుండటం వలన అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోందనే సంగతి ఆయన గ్రహించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తను మాట్లాడుతున్న ఆ మాటలు తన పోరాటం తాలూకు అసలు ఉద్దేశ్యాన్ని నీరుగార్చడమే కాకుండా ఆయన తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకొనే ప్రయత్నాలలో భాగంగానే ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేస్తున్నారనే భావం ప్రజలలో నెలకొంటుంది.

 

తెదేపా ప్రభుత్వం కూలిపోగానే తను రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడం చూస్తే వారి సమస్యకు ఏకైక పరిష్కారం తను ముఖ్యమంత్రి అవడమే అని చెపుతున్నట్లుంది. రైతుల కోసం పోరాడుతున్నానని చెపుతూనే మళ్ళీ నేను మీ భూములను రక్షించలేను. అన్నీ పైనున్న ఆ దేవుడే చూసుకొంటాడు, అని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. దేవుడే చూసుకొంటాడన్నప్పుడు మరి ఆయన ఈ దీక్షలు ధర్నాలు అంటూ హడావుడి చేయడం ఎందుకు? అంటే మళ్ళీ అదే సమాధానం చెప్పుకోవాలేమో?

 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలనే కోరిక ఉంది కనుక దానిని నెరవేర్చుకొనేందుకు అవసరమయిన ప్రయత్నాలు చేసుకుపోవాలి కానీ ఇలాగ పదేపదే ‘నేను ఈ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతాను, మూడేళ్ళ తరువాత ప్రభుత్వం కూలిపోతే ముఖ్యమంత్రి అవుతాను,” అని చెప్పుకోవడం వలన నలుగురిలో నవ్వులపాలవడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదు.