ఐప్యాక్ వైపే జగన్ మొగ్గు.. వైసీపీలో నిస్తేజం!
posted on Aug 12, 2024 2:11PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తన సొంత పార్టీ నేతల కంటే ఐప్యాక్ నివేదికలపైనే ఎక్కువ నమ్మకం ఉండేదన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలలో తన పార్టీ ఘన విజయం సాధించి తాను ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టడానికి ఐప్యాక్ వ్యూహాలే కారణమన్నది ఆయన నమ్మకం. అదే నమ్మకంతో జగన్ ఐప్యాక్ నివేదికలే నమ్ముకుని జగన్ 2024 ఎన్నికలకు వెళ్లారు. అయితే ఈ సారి మాత్రం ఐప్యాక్ వ్యూహాలు జగన్ కు రిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మిగిల్చాయి. 2019 ఎన్నికల విజయం తరువాత 2019 ఎన్నికలలో పార్టీ కోసం పని చేయడానికి జగన్ ఐప్యాక్కు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెబుతారు. అంటే 2024 ఎన్నికలలో ఐప్యాక్ కు జగన్ అంత కంటే ఎక్కేవే చెల్లించి ఉంటారు. అసలు ఐప్యాక్ అనేది వైసీపీలో ఒక భాగంగా మారిపోయింది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో నిండా తల దూర్చింది. ఐప్యాక్ తో ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ములకు జగన్ సంస్థకు కొన్ని కాంట్రాక్టులు ఇచ్చారనీ, అలా ఐప్యాక్ కు పార్టీ పరంగా చెల్లించాల్సిన సొమ్ములు ముట్టచెప్పారని పార్టీ వర్గాలు బాహాటంగానే చెప్పుకున్నాయి. అంతే కాకుండా పలువురు ఐప్యాక్ సభ్యులను వివిధ ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులుగా అప్పాయింట్ మెంట్ పత్రాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించారని కూడా తెలిసింది.
ఇక ఐపాక్య సభ్యులైతే వైసీపీ ఎమ్మెల్యేలను నీడలా ఫాలో అవుతూ వారేం చేయాలో నిర్దేశించేవారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అయితే ఐప్యాక్ సభ్యులే వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. 2024 ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ వారితో ఫొటోలు తీయించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం కంటే అధిక స్థానాలను గెలుచుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అయితే తీరా ఎన్నికలు వచ్చిన తరువాత గతంలో ఏ పార్టీ ఓడిపోనంత ఘోరంగా వైసీపీ పరాజయం పాలైంది. అసలు వైసీపీ ఎన్నికల ప్రచారమే వైనాట్ 175 అంటూ వైసీపీ నేతలే బిత్తరపోయే రేంజ్ లో సాగింది. పార్టీ క్యాడర్ కు, నేతలకు క్షేత్ర స్థాయి పరిస్థితులు ఏమిటి అన్నది అలోచించే సావకాశం ఇవ్వకుండా సాగిన ఆ ప్రచారం చేసిన నష్టమేమిటో పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఫలితాల తరువాత కానీ తెలియలేదు. ఒటమి తరువాత వైసీపీ నేతలు బాహాటంగానే ఐప్యాక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవాలు పార్టీ నాయకత్వానికి తెలియకుండా.. విజయం సాధించబోతున్నామంటూ తప్పుదోవపట్టించిందని విమర్శలు గుప్పించారు. ఇక ఐప్యాక్ తో వైసీపీ బంధం ముగిసిందనే అంతా భావించారు.
అయితే 2029 ఎన్నికలలో కూడా పార్టీ తరఫున పని చేయడానికి జగన్ ఐప్యాక్ తో ఒప్పందం కుదుర్చుకోవడం వారిని దిగ్భ్రమకు గురి చేసింది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి గెలుపు వ్యూహాలు రచించేందుకు ఐప్యాక్ తో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినా.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు అలాంటి ఒప్పందం ఏదో కుదిరిందన్న సందేహాలకు తావిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తరువాత ఐప్యాక్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా జగన్ కు, వైసీపీకి మద్దతుగా ఎటువంటి పోస్టులూ ఐప్యాక్ పెట్టలేదు. కానీ ఇటీవలి కొన్ని రోజులుగా ఐప్యాక్ యాక్టివ్ అయ్యింది.
జగన్ కు మద్దతుగా, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. అలాగే జగన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాష్ట్రపతి పాలన అంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు. దీంతో జగన్ మరోసారి ఐప్యాక్ కు పార్టీని వచ్చే ఎన్నికలలో విజయం బాట పట్టించేందుకు వ్యూహాల రూపకల్పన కోసం ఐప్యాక్ ను ఆశ్రయించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవే అనుమానాలు పార్టీలోనూ గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ నిస్తేజంగా మారిపోయారు. మరోసారి వైసీపీని నమ్ముకుని అడుగులు వేస్తే రాజకీయ మనుగడ ఉండదన్న భయంతో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.