కార్చిచ్చు బారిన ఏథెన్స్ నగరం!
posted on Aug 12, 2024 3:00PM
గ్రీస్ దేశ రాజధాని ఏథెన్స్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముడుతోంది. భారీ స్థాయిలో మంటలు ఏథెన్స్ నగరాన్ని సమీపిస్తున్నాయి. దీంతో ఏథెన్స్.లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 5 వందల మంది అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అగ్నికీలలు అదుపులోకి రావడం లేదు. అగ్నిని నివారించడానికి మొత్తం 152 అగ్నిమాపక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 29 నీళ్ళు చిమ్మే విమానాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఏథెన్స్.తోపాటు దగ్గరలోనే వుండే మారథాన్ ప్రాంతంలో నివసించేవారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నికీలల కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అలాగే అగ్నికీలల కారణంగా వెలువడుతున్న పొగ కారణంగా అస్వస్థతకు గురైన చాలామంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏథెన్స్ నగరంలో పూర్తి స్థాయిలో పొగ కమ్మేసి వుంది. అగ్నికీలలు ఏథెన్స్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో వుంది. బలమైన గాలులు వీస్తున్న కారణంగా మంటలు త్వరగా ఏథెన్స్ నగరాన్ని సమీపిస్తున్నాయి. ఒక్కోచోట మంటల ఎత్తు 85 అడుగులకు పైగా వున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 2018 సంవత్సరంలో కూడా గ్రీస్ దేశంలో ఒక కార్చిచ్చు పుట్టింది. ఆ కార్చిచ్చు వల్ల సముద్ర తీరంలో వున్న అందమైన నగరం మాటి మొత్తం బూడిద అయిపోయింది. అప్పట్లో మాటి నగరంలో అగ్ని కీలల కారణంగా వంద మందికి పైగా మరణించారు.