కవిత బెయిల్ పిటిషన్ విచారణ మరో మారు వాయిదా 

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్  విచారణ మరోసారి  వాయిదా పడింది.  మధ్యంతర బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 20 వ తేదీకి వాయిదా వేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు బెయిల్ లభించబంతో కవిత బెయిల్ మీద బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. తన పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని కవిత మొదటిసారి  బెయిల్ పిటిషన్ దాఖలు చేసి భంగపడారు. ఈ స్కాంలో మొత్తం 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ కావడం విశేషం. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని  ప్రతివాదులైన సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ల కు సుప్రీం ఆదేశాలు జారి చేసింది. కవిత అనారోగ్యానికి గురి కావడంతో కవిత తరపు న్యాయవాది మరో మారు బెయిల్ పిటిషన్ దాఖు చేసుకున్నారు. ధర్మాసనం ఆమె బెయిల్ పిటిషన్ ను అంగీకరించలేదు. 
మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది.
ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసింది. నాటి నుంచి ఆమె తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 15న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది.