ఓటమికి జగన్ బాటలు వేసుకుంటున్నారా?!

అధికారంలో  ఉన్నంత కాలం రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయని జగన్ తన అధికారాంతానికి తానే బాటలు వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్  ఎన్నికల సన్నాహకాలు చూస్తుంటే ఆయన ఓటమిని ఆహ్వానిస్తున్నారా? ఎటూ పరాజయం తప్పదు కనుక తాను స్వాగతించేస్తే పోలా అన్న భావనకు వచ్చేశారా అన్న అభిప్రాయం కలుగుతోందంటున్నారు పరిశీలకులు.

సహజంగా ఎన్నికలనగానే ముందుగా గుర్తొచ్చేది సీట్లు.. టికెట్లు. టికెట్ ఎవరికి ఇస్తారు? ఏ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థి ఎవరు? ఎవరికి ఎవరు పోటీగా నిలబడతారు? ఎవరు ఎవరిపై పోటీకి దిగుతున్నారు? అనేది కీలకం. అయితే, ఇందులో దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీకి డెఫినెట్ గా వెసులు బాటు ఉంటుంది.  అధికారం చేతిలో ఉంటుంది కనుక  పరిస్థితులు అనుకూలంగా మలచుకుని పక్కా వ్యూహాలను సిద్ధం చేసుకునేంత తీరుబాటు ఉంటుంది. అదే  ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకైతే.. ప్రభుత్వంపై పోరాటం, ప్రజలలో మమేకం కావడం వంటి పనులు కూడా ఉంటాయి కనుక అభ్యర్లుల ఎంపిక , అలాగే  పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు చర్చలు వంటి కారణాలతో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఒకింత జాప్యం జరగడం కద్దు. అసలు అధికారంలో ఉన్న పార్టీకి అయితే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేడయం, షెడ్యూల్ విడుదల లోగా పెండింగ్ లో ఉన్న కార్యక్రమాల పూర్తిపై దృష్టి సారించడం చేస్తుంది.  అభ్యర్థుల ఎంపిక, ప్రకటన విషయంలో అధికారంలో ఉన్న పార్టీకి అసలు సమస్య కానే కాదు.  

అయితే ఏపీలో అధికార వైసీపీ మాత్రం ప్రజా వ్యతిరేకత, ప్రజాగ్రహం కారణంగా మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల అంటే సిట్టింగుల వైఫల్యంగా చూపి తాను సేఫ్ కావాలన్న ఆలోచనతో సిట్టింగుల మార్పు కార్యక్రమానికి తెరతీసి  జగన్  తన వైఫల్యాన్ని తానే చాటుకున్నారు.  

జగన్ ఇప్పుడు భారీ స్థాయిలో అభ్యర్థుల మార్పుకు శ్రీకారం చుట్టారు.  ఇప్పటికే ఏడు జాబితాలను విడుదల చేసి 65కు పైగా నియోజకవర్గాలలో సిట్టింగులను మార్చేశారు.  దీంతో ప్రజలలో ఇప్పటికే ఉన్న వ్యతిరేకతకు తోడు సొంత పార్టీలోనూ అసమ్మతి కుంపటిని చేజేతులా రగిల్చినట్లైంది. అభ్యర్థుల మార్పు జరిగిన దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ  కొత్త అభ్యర్థులపై పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఎక్కడా అభ్యర్థుల మార్పు పట్ల సంపూర్ణ అంగీకారం కనిపించడం లేదు. ఎక్కువ నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ తమ నెత్తిమీద రుద్దిన కొత్త అభ్యర్థుల పట్ల నిరాదరణ, నిరాకరణే వ్యక్తమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది.  ఇప్పటికే మార్పుల పట్ల అసంతృప్తితో  కొందరు సిట్టింగులు పార్టీని వీడిపోయారు. మరి కొందరు అదే దారిలో ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ నిర్ణయం వల్ల పార్టీలో జరిగిన నష్టం ఇదైతే ముందుగానే అభ్యర్థులు ఎవరో తేలిపోవడం వల్ల విపక్షాలకు తమ అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు సులువుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ అభ్యర్థిని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహరచనకు, ప్రణాళికల రూపకల్పనకు వెసులుబాటును జగన్ చేజేతులా విపక్షాలకు ఇచ్చినట్లైంది.  నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరో ముందుగానే తెలియడం వల్ల తెలుగుదేశం, జనసేన కూటమి ఆయా  నియోజకవర్గాలలో సమస్యలు, రాజకీయ, సామజిక పరిస్థితులను బేరీజు వేసుకుని మరీ అభ్యర్థులను నిర్ణయించుకోవడానికి మంచి అవకాశం దక్కింది.  దీంతో అసలే గెలుపు అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న వైసీపీకి జగన్ సిట్గింగుల   మార్పు అంటూ మొదలెట్టిన కార్యక్రమంతో  ఆ అంతంత మాత్రం అవకాశాలు కూడా లేకుండా చేసుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఎలాగా వైసీపీ అభ్యర్థులను ప్రకటించేస్తోంది కనుక అది పూర్తయిన తరువాత అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలన్న ఉద్దేశంతో  తెలుగుదేశం, జనసేనలు వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.