జగన్ ఈ లెక్కలు ఎప్పుడు ఆపుతారో...
posted on Nov 24, 2014 2:35PM
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అధికారంలోకి వచ్చిన పార్టీ సంబరాలు చేసుకుంటుంది. ఓడిపోయిన పార్టీ తన ఓటమికి బాధ్యతని ఎవరి నెత్తిన వేయాలా అని ఆలోచిస్తూ వుంటుంది. తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం తనదేనని చెబుతూ వుంటుంది. గెలిచిన పార్టీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని, తాము అమాయకులమని చెప్పుకుంటూ వుంటుంది. అధికారంలోకి వచ్చిన పార్టీ కంటే తమ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం చాలా తక్కువని, అంచేత తాము నైతికంగా ఓడిపోయినట్టు కాదని చెప్పుకుంటూ వుంటుంది. చరిత్రలో ఓడిపోయిన ఏ పార్టీ అయినా ఇలాగే చేసింది. భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తుంది. అయితే ఎన్నికలలో ఓడిపోయిన ఏ పార్టీ అయినా ఎన్నికల ముగిసిన వారం పది రోజుల వరకు ఇలాంటి లెక్కలు చెబుతూ ఆత్మానందం పడుతూ వుంటుంది. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎన్నికలు ముగిసిపోయి, తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అయినప్పటికీ ఇంకా ఎందుకూ పనికిరాని లెక్కల్లోనే మునిగి తేలుతున్నారు.
వైసీపీ నాయకుడు జగన్ ఎప్పుడు మీడియా ముందుకు, ప్రజల ముందుకు, తన పార్టీ కార్యకర్తల ముందుకు వచ్చినా ఆర్నెల్ల క్రితం జరిగిపోయిన ఎన్నికల ఫలితాల తాలూకు చిట్టా విప్పుతున్నారు. గత ఎన్నికలలో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ప్రశంసనీయంగా పరిపాలన చేస్తుంటే, జగన్ మాత్రం ఇంకా తన లెక్కల లోకం వదలి బయటకి రావడం లేదు. తాజాగా సోమవారం నాడు ఒంగోలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన లెక్కల లెక్చరర్ అవతారం ఎత్తారు. గడచిన ఎన్నికలలో వైసీపీకి, టీడీపికి మధ్య ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలేనని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఏవేవో ప్లస్సులు, మైనస్సులు చెప్పి కార్యకర్తల బుర్రలు హీటెక్కించారు. ఐపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు పాత లెక్కలన్నీ చెప్పి సారు ఎందుకు బుర్ర తింటున్నారో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. చంద్రబాబుకి దేవుడి దయ లేదని, మనకు మాత్రమే దేవుడి దయ వుందని కూడా జగన్ వాళ్ళకి చెప్పారు. మనకి దేవుడి దయ వుంటే మనం ఎందుకు గెలవలేదని కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. ఏది ఏమైనా జగన్ భూతకాలంలో విహరించడం మాని వర్తమానంలోకి వస్తే మంచిదని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.