వారిపై అనర్హత వేటు పడదు ష్యూర్!
posted on Nov 24, 2014 6:52PM
ఇటీవల తెరాస కండువాలు కప్పుకొన్న కాంగ్రెస్, తెదేపాలకు చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ రెండు పార్టీలు స్పీకర్ మధుసూధనాచారికి విజ్ఞప్తి పత్రాలు అందజేశాయి. ఆ రెండు పార్టీలు తమ పార్టీకి చెందిన శాసనసభ్యులను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే పార్టీ కండువాలు కప్పి మరీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు దానినే సాక్ష్యంగా భావించి పార్టీ ఫిరాయించిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసాయి.
ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్, తెదేపాలకు చెందిన శాసనసభ్యులు మూకుమ్మడిగా వైకాపాలోకి ఫిరాయించినప్పుడు కూడా తెదేపా తన సభ్యులపై అనర్హత వేటు వేయవలసిందిగా అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరింది. కానీ ఆయన చాలా కాలం వరకు వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. రాజకీయ కూడికలు, తీసివేతలు అన్నీ సరిచూసుకొన్న తరువాత వారిపై అనర్హత వేట వేశారు. అప్పటి పరిస్థితులకి, ఇప్పటికీ చాలా వ్యత్యాసం కూడా ఉంది. ఇప్పుడు ఇతర పార్టీ శాసనసభ్యుల చేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపజేసి తమ తెరాస పార్టీలో చేర్చుకొంటున్నారు. అందువలన అదే పార్టీకి చెందిన స్పీకర్ మధుసూదనాచారి, ఆయన కోరి తెచ్చుకొన్న శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేందుకు సాహసిస్తారని ఆశించడం అత్యాశే కాదు అవివేకం కూడా. అందువలన కాంగ్రెస్, తెదేపాలకు కంటశోష తప్ప వారికొచ్చే ప్రమాదం ఏమీ లేదనే చెప్పవచ్చును.