కరోనా వాక్సిన్ తయారీలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న భారత్!
posted on Apr 16, 2020 11:14AM
కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు మన దేశంలోని ఆరు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని విరుగుడు అందుబాటులోకి రావాలంటే చాలా కాలం పడుతుందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జైడస్ కాడిలా రెండు వ్యాక్సిన్‌లపై ప్రయోగాలు చేస్తోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, మైన్ వ్యాక్స్ లాంటి ఆరు సంస్థలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయని గగన్‌దీప్ కాంగ్, టీహెచ్‌ఎస్‌టీఐ పేర్కొన్నారు.
వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమంటే అది దీర్ఘకాల ప్రక్రియ. వివిధ దశల పరీక్షలను దాటేందుకు, ప్రభుత్వాల ఆమోదం పొందేందుకు నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్ తాయారైన తర్వాత కూడా అనేక సవాళ్ల ఉంటాయి. అన్ని వయస్సుల వారిపై ఇది పని చేస్తుందా? లేదా జన్యు నిర్మాణాన్ని మార్చుకునే క్రమంలో దాన్ని ఎదుర్కోగలదా? వంటి సమస్యలు తలెత్తుతాయని రాజీవ్‌గాంధీ జీవ సాంకేతిక కేంద్రంలోని శాస్త్రవేత్త శ్రీకుమార్ తన అభిప్రాయం చెప్పారు.
భారత దేశంతో పాటు మరో 70 సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీకై ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. అమెరికా, చైనా కూడా వ్యాక్సిన్‌ని తయారు చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రకాల వ్యాక్సిన్‌లు తయారు చేసి జంతువులపై, కొందరి మనుషులపై ప్రయోగించాయి. అయితే అవి అంతగా సక్సెస్ కాలేదని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.