నిప్పులు కడిగే వంశం నుంచి ఎగిసిపడ్డ సంస్కరణల తారాజువ్వ

* నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి 

ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. సంప్రదాయాల పేరిట జరుగుతున్న అరాచకంపై విరుచుకుపడ్డాడు కాబట్టే ఈయన సార్ధక నామధేయుడయ్యాడు.. కందుకూరి వీరేశలింగం తన ఐదో యేట బడిలో చేరి నేర్చుకున్నవి… బాల రామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ట శతకం. పన్నెండో ఏట నుంచీ పూర్తిగా ఇంగ్లీషులోకి వచ్చేశాడు. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ భావాలు, ఇంగ్లిష్‌లో సంభాషణలు. సిలబస్‌తో పాటు అతడు కేశవ్ చంద్రసేన్ పుస్తకాలు చదివాడు. బెంగాల్ రచయిత అతడు. స్త్రీని స్థిమితంగా ఉంచలేని సమాజం అది ఎంత ఆధునికమైనదైనా, నాగరికమైనది కానే కాదని చంద్ర సేన్ రాశాడు. అది పట్టేసింది వీరేశలింగాన్ని. తను అనుకుంటున్నదే ఆయనా రాశాడు!

అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్నాడు వీరేశలింగం. ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా! ఎవరి స్వార్థం వారిదే. ఎవరి నమ్మకాలు వారివే. ప్రజలారా మారండి అని వ్యాసాలు రాశాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు.ఎవరూ మారలేదు. వీడెవరో పిచ్చివాడు అనుకున్నారు. కొత్త పిచ్చోడు అనుకున్నారు. రాజారామ్మోహన్ రాయ్‌ననీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్‌ననీ అనుకుంటున్నాడేమో అన్నారు. ఇది బెంగాల్ కాదు, ఆంధ్రదేశం బ్రదర్ అని హితవు చెప్పారు.

వీరేశలింగానికీ సమాజానికీ పడడం లేదు. సమాజం అతడికన్నా బలమైనది. అంతకన్నా మొండివాడు వీరేశలింగం. ఉపాధ్యాయుడుగా అతడు శక్తిమంతుడు. ఒక తరాన్ని మలచగలడు. పత్రికా సంపాదకుడిగా అతడు శక్తివంతుడు. భావ విప్లవం తేగలడు. కానీ తరాన్ని మలచడానికి, విప్లవం రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకు బాల్యవివాహాల బలిపీఠాల నుంచి చిన్నారులను రక్షించేదెలా? బాల వితంతువుల యవ్వనాన్ని భద్రపరిచేదెలా? సమాజం ఉలిక్కిపడి లేచేలా గట్టి దెబ్బ వేయాలి అనుకున్నాడు వీరేశలింగం.

ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉండాలంటే – ఊరూరూ తిరిగి, వీధి వీధి తిరిగి తనకు తగిలిన గాయాన్ని ఈ దురాచార సమాజం ఏడ్చుకుంటూ చూపించుకోవాలి.పంతులుగారికి అప్పటికే రాజమహేంద్రవరం నిండా, ఆంధ్రదేశం నిండా శత్రువులు మొనదేలిన రాళ్లలా తయారై ఉన్నారు. విజయనగరం మహారాజుగారి బాలికల పాఠశాల ప్రాంగణంలో రెండు నెలల వ్యవధిలో ఆయన ఇచ్చిన రెండు స్పీచ్‌లు సంప్రదాయాల తాళాలు బద్దలు కొట్టి, ఇళ్లలో చొరబడి, వితంతు బాలికల కోసం వెదకడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా అదే చర్చ. ఆయనదే రచ్చ!

"ఎవరయ్యా ఈ త్రాష్టుడు. విలువల్ని భ్రష్టుపట్టించడానికే పుట్టాడా ఈ రాజమహేంద్రవరంలో?, ఒక పెళ్లి చాల్లేదా సంఘ సంస్కర్త గారికి! వితంతువులను ఉద్ధరించే పేరుతో ఊరిమీద పడ్డాడు!!, వీడిదసలు బ్రాహ్మణ పుట్టకేనా? సభల్లో ఏం కూస్తున్నాడో విన్నారా?" వీరేశలింగం కనిపిస్తే పట్టుకుని కుళ్లబొడిచేయాలన్నంత కోపంతో ఉంది ఊరూవాడ. ‘మనవాళ్లు పూర్వాచార పరాయణులగుట చేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారమునైన నంగీకరింతురుగాని, యాచార విరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు’ అని వీరేశలింగం ఏమాత్రం మొహమాటం లేకుండా, మర్యాద లేకుండా సభల్లో ఉపన్యసించడం పెద్దపెద్దవాళ్లకు ఆగ్రహం తెప్పించింది.

 

 

 1881 డిసెంబర్‌ 11వ తేదీన మొదటి వితంతు వివాహం

భువనగిరి పరదేశీ సోమయాజులు, శ్రౌతము కోటీశ్వరశాస్త్రులుగారు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, ఓగిరాల జగన్నాథం, వేంకటరాయ శాస్త్రులు, దంతులూరి నారాయణ గజపతిరావు, దాసు శ్రీరాములు పంతులు వంటి మహామహులు వీరేశలింగంపై విరుచుకుపడ్డారు. ఆయనపై ఖండన గ్రంథాలు రాశారు. ఉత్తరాలు రాశారు. వాటిలో ఏ ఉత్తరానికీ ఆయన విలువ ఇవ్వలేదు. ఒక ఉత్తరానికి తప్ప. అది.. కృష్ణమండలంలోని తిరువూరు డిప్యూటీ తాసిల్దారు బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందం గారి నుంచి వచ్చిన ఉత్తరం. ‘తిరువూరు తాలూకా రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదనీ, ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె తల్లి సీతమ్మ సిద్ధ్దంగా ఉన్నారని’ అందులోని సారాంశం. ‘మీదే ఆలస్యం’ అని పంతులుగారు తక్షణం రిప్లయ్ ఇచ్చారు. అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరం తెప్పించి తన ఇంట్లో, తన భార్య సంరక్షణలో ఉంచుకున్నారు. ఆ వెంటనే వరుడి వేట మొదలైంది!వీరేశలింగం పంతులుగారి ఇల్లు

విశాఖపట్నం పోలీస్ హెడ్ క్వార్టర్ట్స్‌లో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు అనే యువకుడు ఆ క్షణంలో పంతులుగారి మదిలో మెదిలారు. గతంలో అతడు పంతులుగారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అతడికి కబురు పంపారు. శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాడు. అది అతడికి పంతులుగారిపై ఉన్న గౌరవం. శ్రీరాములుకు అంతకుముందే పెళ్లయింది. భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా వితంతు వివాహం చేసుకోడానికి అతడు వేచి ఉన్నాడు. చివరికి గౌరమ్మ దొరికింది!

పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి. వరుడి పేరును కూడా పంతులుగారు రహస్యంగా ఉంచారు. గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికీ తెలిసింది కానీ వరుడెవరో బయటికి పొక్కలేదు. పెళ్లికి కావలసిన రక్షణ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్నల్ పోర్చిస్ దొరగారి నుంచి లభించింది. పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడా రామకృష్ణయ్యగారు సమకూర్చారు. వధూవరులకు కావలసిన నైతిక స్థయిర్యాన్ని పంతులుగారు ఇచ్చారు. అలా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది.

చివరి నిమిషంలో వరుడి తల్లిదండ్రులకు విషయం తెలిసి గగ్గోలు పెడుతూ కల్యాణ మంటపానికి చేరుకున్నారు. వేయడానికి అక్షింతలు, ఇవ్వడానికి అశీర్వచనాలు తప్ప వాళ్లకేం మిగల్లేదు. ఆ వివాహానికి వెళ్లిన వాళ్లందరినీ సమాజం గుర్తుపెట్టుకుని మరీ వెలి వేసింది. వేడుకలకు, వివాహాలకు పిలవడం మానేసింది. పంతులుగారిని చీడపురుగుగా చూసింది. పనిగట్టుకుని వేధించింది. వీరేశలింగం భయపడలేదు. వెనకడుకు వెయ్యలేదు. నేనింతే అన్నాడు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా పెళ్లిళ్లు చేస్తానని సవాల్ విసిరాడు. ‘‘ఈ బక్క పీనుగకు చావైనా రాదే! వీడి మీది గౌరవంతో వీడి పెళ్లానికి ఇంకో పెళ్లి చేద్దుము’’ అని శుద్ధ సంప్రదాయవాదులు పంతులుగారిని రహస్యంగా తిట్టుకున్నారు. ఆ రహస్యం ఆయన చెవిన పడి నవ్వుకున్నారే గానీ, నమ్మిన తోవను వదిలి వెళ్లలేదు.

వీరేశలింగం పంతులుగారు శారీరకంగా బలహీనులైతే కావచ్చు. మానసికంగా బలవంతులు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మిగారు. వీళ్లందరి సహకారంతో పంతులుగారు తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. తను బతికుండగా నలభై వరకూ వితంతు వివాహాలు జరిపించారు. ఈ దుస్సాహసమే ఆయన్ని నేడు సంఘసంస్కర్తగా నిల బెట్టింది.