ఇక కోరినన్ని లడ్డూలు!

తిరుమల ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో నియంత్రణ ఎత్తివేసింది. భక్తులకు కోరినన్ని లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించింది. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరించడమే కాకుండా, తిరుమల వెళ్లి వచ్చిన తరువాత ఆ లడ్డూ ప్రసాదాన్ని బంధు మిత్రులకు, ఇరుగుపొరుగులకు పంచుతుంటారు. అందుకే తిరుమల దర్శనం చేసుకున్న వారంతా ఎక్కువ సంఖ్యలో తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలను కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే ఇంత కాలం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విక్రయించే లడ్డూలపై నియంత్రణ విధించడంతో అవసరమైనన్ని లడ్డూలు కొనుగోలు చేయలేక భక్తులు నిరాశ చెందే పరిస్థితి ఉంది. అయితే ఇక నుంచి భక్తులను నిరాశ పరచకుండా వారు కోరినన్ని లడ్డూలను సరఫరా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం అదనపు లడ్డూల   తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది. 

భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా లడ్డూల తయారీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీవైష్ణవులు, 10 మంది శ్రీవైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో లడ్డూ విక్రయాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వేళల్లో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. అందుకే అదనపు లడ్డూల తయారీకి టీటీడీ నిర్ణయించింది.

కాగా దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70 వేల మంది ప్రతి రోజూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70 వేల ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తుంటారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలను తయారు చేస్తోంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు.