హడలెత్తిస్తున్న ఐటీ సోదాలు

నిజానికి ఒక తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా  సోదాలు ఆగడం లేదు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో మరో మారు ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం(జనవరి 31) ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని వసుధా ఫార్మాలో ప్రారంభమైన సోదాలు ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటాయో అనే భయం అందరినీ  కలవరపాటుకు గురు చేస్తోంది.  ఇదలా  ఉంటే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.అలాగే రాజ్ పుష్ప, వెరిటిక్స్, ముప్పా, లైఫ్ స్టైల్ సంస్థల్లో ఇలా మొత్తం 51 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 

వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఇళ్లు ఏకంగా 10 ఎకరాల్లో ఉంది. వెంకట్రామిరెడ్డి, ఆయన సోదరుడు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ఇల్లు అత్యంత అధునాతన సౌకర్యాలతో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు పలు డాక్యుమెంట్లను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే వెంకట్రామిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన సంస్థల ట్యాక్స్ చెల్లింపుల వివరాలు, బ్లాక్ మనీపై ఆరా తీస్తున్నారు.

 తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్ సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలా ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీలు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  జరిగాయి. ఇక తాజాగా మరోసారి ఏపీ, తెలంగాణలో సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్ సంస్థ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సహా 51 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.

 కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉండగా ఐటీ అధికారులు తరచూ రైడ్స్ జరగడం ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ పెడుతున్నాయి.