ఆప్ కు ఆమె గుడ్ బై

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవికీ  రాజీనామా చేశారు. ఇదేమీ అనూహ్య పరిణామం కాదు. ఎప్పుడైతే  ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపారో అప్పుడే ఇందిరా శోభన్  ,అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి, కాంగ్రెస్ తో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఇందిరా శోభన్.. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనపై  వ్యవహరించిన తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ 2021లో రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్‌-టీపీలో చేరారు. అయితే  షర్మిల అహంకార ధోరణికి విసుగు చెంది  కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్‌-టీపీకి కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీలో చేరారు. కేజ్రివాల్ ఆమెను తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ గా నియమిచారు. ఇప్పుడు తాజాగా ఆప్ కు గుడ్ బై చెప్పారు. 

ఆమె తన రాజీనామా లేఖను అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ దోస్తీని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇందిరా శోభన్  ప్రధానంగా తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. రాష్ట విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథిగా, కేసీఆర్ కుటుంబ పాలనకు, అవినేతికి వ్యతిరేకంగా గళ మెత్తారు. పోరాటం చేశారు. ఆ పోరాటం కొనసాగింపుగానే  ఆమె ఆప్  లో చేరారు. అయితే  కేజ్రివాల్  కేసేఆర్ తో చేతులు కలపడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు. 

సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తో కలిసి నడవాలని నిర్ణయించడంతో ఆప్  సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లైందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్తాపానికి గురైనట్టు ఇందిరా శోభన్ వెల్లడించారు. ఖమ్మం సభకు వచ్చినప్పుడే కేజ్రీవాల్ ముందు తన సందేహాన్ని ఉంచానని ఆమె చెప్పారు. ఇవాళ పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ బాయ్ కాట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. అంబేద్కర్ ఫోటో పెట్టుకునే కేజ్రీవాల్ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఆ పదవిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న కేసీఆర్ తో కలిసి ఈ దేశ ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారని కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.

అదలా ఉంచి, అరవింద్ కేజ్రివాల్ విషయానికి వస్తే  ఆయనకు  ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సామాజిక కార్యకర్త అన్నా జహారే సారథ్యంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేజ్రివాల్  ఆ తర్వాత, హజారే అభీష్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీపార్టీని స్థాపించారు. నిజానికి  కేజ్రివాల్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని అన్నా హజారే చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్  స్కాం  వెలుగు చూసిన నేపధ్యంలో, కేజ్రివాల్ కు రాసిన లేఖలో కూడా అన్నా హజారే గతాన్ని గుర్తు చేశారు.. మీరు  'స్వరాజ్' మకుటంతో రాసిన పుస్తకంలో   ఎన్నో ఆదర్శవంతమైన విషయాలు రాశారు.. అప్పుడు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. కానీ రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయ్యాక ఆదర్శ సిద్ధాంతాన్ని మరిచిపోయినట్లున్నారు  అని హజారే ఆలేఖలో పేర్కొన్నారు. అంతే కాదు, 2012లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో తన సహచరుడిగా ఉన్న కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. "ఇతర పార్టీల మార్గాన్ని అనుసరించడం" ప్రారంభించిందని విమర్శించారు. మద్యం, సిగరెట్ల విక్రయాలపై కేజ్రీవాల్‌కు గతంలో ఉన్న వైఖరిని హజారే గుర్తు చేశారు. కేజ్రీవాల్ మాటలకు, ఆయన చర్యలకు తేడా ఉందని హజారే ఆరోపించారు. 

 కేజ్రీవాల్ తాను బోధించినవన్నీ మరచిపోయారని, ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించిందని, దీని ద్వారా మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని ప్రోత్సహిస్తోందని హజారే ఆరోపించారు. మద్యం అమ్మకాలను అరికట్టడంలో లేదా పరిమితం చేయడంలో విజయం సాధించిన మహారాష్ట్రలోని పలు గ్రామాలను ఆయన ఎత్తి చూపారు. దేశ రాజధానిలో కూడా కేజ్రీవాల్ ఇదే విధానాన్ని అమలు చేస్తారని తాను ఊహించానని, అయితే అది జరగలేదన్నారు.  ఇటువంటి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ మీరు అలా చేయలేదు. డబ్బుకు అధికారం, అధికారం డబ్బుకు డబ్బు అనే ఈ విష చక్రంలో ప్రజలు తరచుగా చిక్కుకుంటారు' అని హజారే వ్యాఖ్యానించారు. ఇప్పడు అవే ఆరోపణలు ఇందిరా శోభన్ చేశారు.