పెరిగేవి ఏవి? తగ్గేవి ఏవీ.. మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది!

యూనియన్ బడ్జెట్ అనగానే దేశంలో మధ్యతరగతి ఆశల పల్లకిలో ఊరేగడం మొదలెట్టేస్తోంది. ఇది ఏటా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే అదే మధ్య తరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సంపన్నులకు సానుకూలంగా.. మధ్య తరగతిని దిగువ మధ్య తరగతిని ఊసూరుమనిపించే  విధంగా బడ్జెట్ రూపకల్పన అన్నది పరిపాటిగా మారిపోయింది. ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తున్నదన్న అంచనాల మధ్య పార్లమెంటులో బుధవారం (ఫిబ్రవరి1) విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై దేశ ప్రజలే కాదు.. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా, ఆశగా చూస్తున్నాయి.  

మరి నిర్మలా సీతారామన్ ఆ అంచనాలను అందుకుంటారా? మధ్యతరగతి మందహాసం చేసేలా, సామాన్యుల ఆశలను నెరవేర్చేలా నిర్మలమ్మ బడ్జెట్ ఉంటుందా? పెరిగేవి ఏవి? తగ్గేవి ఏవి? వీటన్నిటినీ సమాధానం మరి కొద్ద గంటల్లో లభిస్తుంది. వితంతమంతి నిర్మలా సీతారామన్... ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యి బడ్జెట్‌కి ఆమోదం పొందుతారు. ఆ తరువాత   నిర్మలా సీతారామన్  పార్లమెంట్‌కి చేరుకుంటారు. వెంటనే కేంద్ర కేబినెట్ మంత్రులతో సమావేశం అవుతారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం.. బడ్జెట్‌ని ఆమోదిస్తుంది.
ఆ తర్వాత నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తారు. బడ్జెట్ బ్రీఫ్‌తో  లోక్‌సభలోకి వెళ్తారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఇది పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సభ గురువారానికి (ఫిబ్రవరి 2)వాయిదా పడుతుంది. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ మొదలవుతుంది.

ఆర్థిక సర్వేని బట్టీ ఈసారి బడ్జె్ట్‌పై   భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటం  ఈసారి బడ్జెట్‌పై అంచనాలు భారీగా పెరగడానికి ఒక కారణం.  ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం బడ్జెట్ పైనా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  ఏది ఏమైనా మధ్యతరగతి ఆశల పల్లకీలో ఊరేగుతోంది. ఆర్థిక వేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురుచూపులకూ మరి కొద్ద గంటలలో తెరపడే అవకాశం ఉంది. అయినా ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో  2023-24 ఆర్థిక సంవత్సరంలో   స్థూల దేశీయోత్పత్తి 6 నుంచి 6.8 శాతం మధ్యలో ఉండొచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే భారత జీడీపీ మెరుగ్గా ఉంది.  

కొనుగోలు శక్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. ద్రవ్య వినిమయంలో ఐదో స్థానంలో ఉంది.  జీడీపీ 6 నుంచి 6.8శాతం మధ్య పరిమితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా సంభవించే ఆర్థిక, రాజకీయ పరిణామాలు దీనిని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.  కరోనా మహమ్మారి నుంచి భారత్ కోలుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా పూర్వపు స్థితికి చేరుకుంది.  

అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి మారకం విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.   ప్రభుత్వం తీసుకొచ్చిన  అత్యవసర రుణ హామీ పథకం సత్ఫలితాలు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలు వేగంగా కోలుకున్నాయి. ఫలితంగా 2022 జనవరి నుంచి నవంబరు మధ్య కాలంలో రుణాల వృద్ధి 30.5శాతానికి చేరుకుంది.  వాహనాల అమ్మకాల్లో జపాన్, జర్మనీ దేశాలను వెనక్కి నెట్టి భారత్ 3వ స్థానానికి చేరుకుంది. జీడీపీలో 7.1శాతం వాటా వాహన రంగానిదే.