ఇస్రో వందో ప్రయోగం పీఎస్ఎల్‌వీ-సీ21 సక్సెస్
posted on Sep 9, 2012 11:40AM
అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఎస్ఎల్‌వీ-సీ21 ప్రయోగాన్ని భారత శాస్త్రవేత్తలు ఆదివారం ఉదయం సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ దగ్గర నుంచి వీక్షించారు. పీఎస్ఎల్‌వీ-సీ 21 ప్రయోగ వాహక నౌక నిర్దిష్ట మార్గంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిర్ణీత కక్ష్య దిశగా నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి 9.51 గంటలకు జరగవలసి ఉంది. అయితే 2 నిమిషాలు ఆలస్యంగా అనగా 9.53 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అందుకు కారణం రోదసీలో అప్పటికే పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలను ఢీకొనే ప్రమాదంను నివారించడానికి ఆ విధంగా ప్రయోగ కాలాన్ని మార్చారు.
పీఎస్ఎల్‌వీ-సీ 21 ప్రయోగించిన 18 నిమిషాల 33 సెకన్లకు ప్రధాన ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలో ప్రవేశించింది. భూతల ప్రధాన ప్రయోగ కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు అనుక్షణం ఉపగ్రహ మార్గాన్ని పర్యవేక్షించారు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం అయిందనీ, ఇది భారత జాతికే గర్వకారణమనీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.