జగన్ పట్ల ధిక్కారమే వారి లక్ష్యమా?
posted on Mar 20, 2025 8:36PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్న పార్టీనే గానీ.. ప్రజాస్వామికంగా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి స్థాపించి.. తానే ఆ పార్టీకి మోనార్క్ అని భావించుకుంటూ.. నియంతలా నిర్వహిస్తున్న పార్టీ అది. రికార్డుల్లో కూడా అలాంటి పోకడే ఉండాలనే ఉద్దేశంతోనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుని.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం- ఆ పప్పులన్నీ ఉడకవని మొట్టికాయలు వేసిన తరవాత నాలిక్కరచుకుని వెనక్కు తగ్గారు. అలాంటి పార్టీలో ఎవరైనా చెలామణీ అవుతున్నారంటే.. వారందరరూ జగన్ దయాదాక్షిణ్యాల మీదనే బతుకుతున్నట్టుగా ఆయన భావిస్తూ ఉంటారు. అలాంటి వాతావరణం ఉండే పార్టీలో ఆయనను ధిక్కరించి నడుచుకునే వాళ్లు ఉండరు. సాధారణంగా అలాంటి వారు పార్టీని వదలి తమ దారి తాము చూసుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ శాసనసభలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు.. జగన్ పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించాలనుకుంటున్నారా? ఇలాంటి చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
శాసనసభలో పది శాతం ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష నేత హోదా దక్కదు అనే సంగతి తనకు స్పష్టంగా తెలిసినప్పటికీ, అదే మాటలతో గతంలో చంద్రబాబును ఎద్దేవా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సభకు రాబోనంటూ పట్టుపట్టారు. తన పార్టీ తరఫున గెలిచిన మిగిలిన పదిమందినీ కూడా వెళ్లనివ్వకుండా నియంత్రించారు. అయితే.. ఈలోగా.. వరుసగా 60రోజులు సభకు గైర్హాజరైతే పదవి పోతుందనే రాజ్యాంగ నిబంధన తెరపైకి వచ్చింది. జడుసుకున్న జగన్, తొలుత మేకపోతు గాంభీర్యంతో మాట్లాడారు గానీ పిమ్మట అందరినీ వెంటబెట్టుకుని ఒక రోజు సభకు వచ్చి వెళ్లారు.
ఆ తరువాత కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో సభ దాక వచ్చి అటెండెన్సులో సంతకాలు చేసి.. సమస్యలపై సభకు ప్రశ్నలు ఇచ్చేసి.. సభలోనికి అడుగుపెట్టకుండానే బయటకు వెళ్లిపోతున్నారని ఇవాళ స్పీకరు అయ్యన్నపాత్రుడు గుర్తించారు. దొంగ చాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాల్సిన, దొంగల్లాగా వ్యవహరించాల్సిన ఖర్మ వారికేం పట్టిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు కూడా. దీనికి ఆ ఏడుగురిలో ఒకరైన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటర్ ఇస్తూ .. తాము దొరల్లాగానే వచ్చి వెళ్లాం అని వివరణ ఇచ్చారు కూడా.
ఆ సంగతి పక్కన పెడితే.. వ్యక్తిస్వామ్య పార్టీగా నడిచే వైఎస్సార్ కాంగ్రెస్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను సభకు వెళ్లవద్దని నిర్దేశించిన తర్వాత.. వారు సంతకం పెట్టడం మాత్రం ఎలా జరిగింది? సంతకాలు పెట్టేయడం ద్వారా.. తమ మీద అనర్హత వేటు పడకుండా కాపాడుకోవాలని వారు అనుకున్నారా? లేదా, ఈ విషయం దాచేస్తే దాగేది కాదు కాబట్టి, తద్వారా జగన్మోహన్ రెడ్డి ఆదేశం పట్ల తమ ధిక్కార స్వరాన్ని బహిరంగంగానే వినిపించదలచుకున్నారా? అనే మీమాంస ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. తాను వద్దని చెప్పిన తర్వాత సభకు వెళ్లిన వారి మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో తాటిపర్తి చంద్రశేఖర్ వివరణ కూడా రావడం విశేషం.
ఈ ఏడుగురి వైఖరి ఖచ్చితంగా జగన్ పట్ల ధిక్కారమేనని, అయితే, వారి మీద కోపం వచ్చినా కూడా ఇదివరకటిలాగా ప్రదర్శించలేని దుర్బల స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే మీద ఆగ్రహిస్తే వారు పార్టీకి రాజీనామా చేసేస్తారో అనే భయం ఆయనలో ఉన్నదని ప్రజలు కూడా అనుకుంటున్నారు.