బాధ్యత లేని సలహా.. ఆలోచన లేని ఆచరణ

సలహాలు ఇచ్చే వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ సలహాలను పాటించి నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి బాధ్యతగా లేకపోతే.. ప్రజలకు అష్టకష్టాలే. వారి వ్యతిరేకతా, ఆగ్రహం అన్నీ కూడా నేరుగా నిర్ణయాలు అమలు చేసే ప్రభుత్వం మీదకే వెళతాయి కానీ.. బాధ్యత లేని సలహాల మూటలు విప్పే వారిపై కాదు. ఇప్పుడు కొత్తగా వైసీపీ సర్కార్ ఆరంభించిన జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం కూడా అలాంటిదే. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమ రూపశిల్పి అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి.. వచ్చే ఎన్నికలలో గెలుపు మంత్రంగా ఎంచి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతటి కీలకమైన ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి కాకుండా, ప్రభుత్వ ముఖ్య సలహాదారు మీడియా ముందుకు వచ్చి వివరించడంలోనే ఈ కార్యక్రమం ఎవరి బ్రెయిన్ చైల్డ్ అన్నది అర్ధమైపోతోంది.

అసలింతకీ ఈ పథకం ఏమిటి? ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుంది. జగనన్నే మా భవిష్యత్ అంటూ జనంలోకి వెళ్లడానికీ, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికీ తేడా ఏమిటి? గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులకు గడపగడపలోనూ పరాభవం ఎదురైంది. మరి ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్ అంటూ జనం ముందుకు ఎవరు వెళతారు? వారిని జనం ఎందుకు స్వాగతిస్తారు అంటే.. ఎవరి వద్దా సమాధానం లేదు. కానీ దబాయింపు సెక్షన్ అని ఒకటి ఉంది. గత నాలుగేళ్ల జగన్ పాలనలో పకడ్బందీగా అమలు అవుతున్న సెక్షన్ ఇది ఒక్కటి మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు.

జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ అధికారులతో గడపగడపకూ వెళ్లిన ప్రజాప్రతినిథులు ఇక నుంచీ వలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు వెడతారు. వీరంతా జగన్ గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాల లబ్ధి దారులు ఎవరు ఉండాలి, ఎవరికి కొనసాగించాలి, ఎవరికి రద్దు చేయాలి అన్నది నిర్ణయించే వారు. వారి పని అదేనని జనం నమ్ముతున్నారు. వీరు ఇంటింటికీ తిరిగి మీకు అందుతున్న పథకాలు ఇవీ, దాని వల్ల నగదు రూపేనా మీరు తీసుకుంటున్న లబ్ధి ఇది అని వివరించి, జగనన్నే మీ భవిష్యత్ అని అంగీకరించకుంటే ఇవేవీ అందవు అని ఒక విధంగా వారిని బెదరిస్తారన్న మాట.

అక్కడితో అది అయిపోలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ పాలన, ప్రస్తుత జగన్ పాలన గురించి అధికార పక్షం వెర్షన్ తో ఒక కరపత్రం ఉంటుంది. ఇక తరువాత జగనన్నే మా భవిష్యత్ అని వారి చేత ఒప్పించి.. ఆ వచ్చిన వాళ్లు ఒక ఫోన్ నంబర్ కు మిస్డ్ కాల్ చేయిస్తారు. అంతే అలా మిస్డ్ కాల్ చేసిన వారంతా జగనన్నే మా భవిష్యత్ అని భావిస్తున్న వారైపోతారు. 

 అప్పుడు వారికి జగన్ సందేశం వినిపిస్తుంది. ఆ తరువాత ఇంటికి స్టిక్టర్ అతికించేస్తారు. అంటే ఆ ఇంట్లో ఓట్లన్నీ జగన్ పార్టీకే అని కన్ ఫర్మ్ చేసేసుకుంటారు.  ఈ తంతంతా ఇందుకు ఇష్టపడితేనే జరుగుతుందని ఘనత వహించిన సలహాదారు చెబుతున్నా.. అలా ఇంటి మీదకు వచ్చి మేం చేస్తున్న ఘనమైన సంక్షేమాన్ని అంగీకరించి, మిస్ట్ కాల్ చేయండి అంటే నో అనే ధైర్యం ఎవరైనా చేస్తారా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. భయంతో అంగీకరించినా ఓట్లు వేసే టైమ్ కు జనం వారి నిర్ణయం మేరకే.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో జగన్ ను భయపెట్టిన ఆత్మ ప్రబోధానుసారమే నిర్ణయం తీసుకుని అమలు చేస్తారని పరిశీలకులు అంటున్నారు.