పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పురోగతి ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్టును అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జల వనరుల నిపుణులు పరిశీలించారు. ఆదివారం ప్రాజెక్టు దగ్గరకి చేరుకుని, అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి వచ్చిన డేవిడ్ పి పాల్, గెయిన్ ప్రాంకో డి సిక్కో, కెనడా నుంచి వచ్చిన రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ అంతర్జాతీయ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్ల దగ్గర్నుంచి, ఇప్పటి పరిస్థితి వరకు ప్రతి విషయాన్ని ఈ నిపుణులు కూలంకషంగా అధ్యయనం చేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు ప్రాజెక్టు దగ్గరే ఈ నిపుణులు వుంటారు. పనులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత వీరు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలసి సమీక్ష నిర్వహిస్తారు.