ఏపీ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం జగన్ నిర్వాకమే!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో విద్యుత్ రంగాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించేశారు. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైపోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలు అప్రకటిత విద్యుత్ కోతలతో నరకాన్ని చూశారు. విద్యుత్ సంస్థ  అప్పుల ఊబిలో కూరుకుకోవడానికి కారకుడయ్యారు. జగన్ ప్రభుత్వం విద్యుత్‌ సంస్థ నిర్వహణ కోసం రూ. 53,560 కోట్లు అప్పులు చేసింది. అంతకుముందు శ్లాబ్‌ల మార్పు టారిఫ్‌ల సవరణ, ట్రూఅప్‌ పేరిట ప్రజలపై సుమారు రూ. 18,817 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది.

ఆ తర్వాత కూడా నిర్వహణ కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది. తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ప్రశ్నించినట్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖపై ఈ నెల 8న శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్న  నేపథ్యంలో  విద్యుత్  సంస్థ ఆర్థిక అంశాలపై చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.  విద్యుత్ సంస్థ ఐదేళ్లలో 1.20లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోవడంపై అధికారులను ప్రశ్నించారు.  వైసీపీ అసంబద్ధ నిర్ణయాల కారణంగానే విద్యుత్ సంస్థ కూనారిల్లిందని అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు. జగన్ సర్కార్ స్వల్ప కాలిక ఒప్పందాల ద్వారా బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేసిన కరెంట్ ఎంత?  విద్యుత్ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడానికి కారణాలు తదితర కారణాలపై ఆరా తీశారు. 

 కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని గత సర్కార్ జాప్యం చేసిన కారణంగా ప్రజలపై సుమారు రూ.15,000ల కోట్ల విద్యుత్‌ ఛార్జీల భారం మోపక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నది అధికారుల వివరణ.  2019 నాటికి సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయయనీ అయితే జగన్  సర్కార్ వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టలేదని  అలాగే థర్మల్‌ యూనిట్లను ఉత్పత్తిలోకి తేవడంలో రెండేళ్ల జాప్యం వల్ల ఇంట్రస్ట్‌ డ్యూరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఐడీసీ) కింద రూ.10,000ల కోట్ల భారం ప్రజలపై భరించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.