నిద్ర మీద శరాఘాతం ఇన్సోమ్నియా!!

కొందరు మానసిక చికాకులవల్ల, ఆలోచనలవల్ల నిద్ర పట్టడం లేదనుకుంటే మరి కొందరు పైకి ఏ కారణం లేకుండానే రోజుల తరబడి సరైన నిద్రపోకుండా గడిపేస్తారు. కొందరు రాత్రిళ్ళు గుడ్ల గూబల్లాగా కళ్ళు తెరచి గడియారం వంక చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నిరీక్షిస్తూ వుంటారు. ఇలాగే రోజులు, నెలలు, సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపే వ్యక్తులు ఎందరో వున్నారు. ఈ రకంగా నిద్ర పట్టకపోవడం కూడా ఒక వ్యాధే. దీనినే వైద్యభాషలో "ఇన్సామ్నియా" అంటారు. అసలు నిద్ర పట్టకపోవడాన్నీ, ఎవరికైనా నిద్రపట్టినా సరిగ్గా పట్టకపోవడాన్ని ఇన్సామ్నియాగా భావించవచ్చు. 


సాధారణంగా పెద్దవాళ్ళు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు, పిల్లలు 10-11 గంటలు నిద్రపోతారు. చంటిపిల్లలు రోజుకు 18 గంటల వరకూ నిద్రిస్తారు. ఎవరికైనా సరే పడుకున్న గంట తరువాత మంచి నిద్ర పడుతుంది. తరువాత 4 గంటలకు ఆ నిద్ర తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ ఒక గంటలో ఆ నిద్ర తీవ్రత పెరుగుతుంది. అంటే ఎనిమిది గంటల పాటు వరసగా నిద్రపోయే వారికి మధ్యలో కొద్దిసేపు నిద్ర తీవ్రత తక్కువగా ఉండి త్వరగా మెలుకువ రావడానికి ఆస్కారం వుంది. ఏది ఏమైనా వయస్సుకు తగినంత నిద్రపోయేవారు. శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటారు.


ఆరోగ్యవంతుడైన వ్యక్తికి వరసగా రెండు మూడు రోజులు నిద్ర లేకపోయేసరికి కళ్ళు మండడం, తలనొప్పి అనిపించడం, తలతిరగడం, ఒళ్ళు కూలడం, నరాల బలహీనత, అనవసరంగా ఆందోళన కలగడం లాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, శక్తి లేనట్లు అనిపించడం, ఆలోచనల్లో క్రమం లేకపోవడం, కనురెప్పలు బరువుగా మూసుకుని పోవడం, మాటలు తడబడడం, ఊరికినే కోపం, చికాకు కలగడం కూడా సహజమే. కాని నిద్ర రాని వ్యాధితో బాధపడే వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి.


అటువంటి వ్యక్తులు సాధారణంగా న్యూరోటిక్ వ్యక్తులైనా అయి ఉంటారు, లేదా సైకోటిక్ వ్యక్తులయినా ఆయి వుంటారు. న్యూరోటిక్ వ్యక్తులలో మానసిక ఆందోళన, ఆలోచన, గందరగోళం, ఆవేశం ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి భయం, ఆదుర్దా ఉంటాయి. ఇటువంటి ఆందోళనలు, అంతులేని ఆలోచనలు ఉండడంతో నిద్ర పట్టదు. మరి కొందరు మానసిక రోగులకు సైకోసిస్ వల్ల భ్రమలు, భ్రాంతులతో మనస్సునకు స్థిమితం లేక నిద్ర పట్టదు. అలాగే నిరుత్సాహం (డిప్రషన్) వల్ల కూడా కొందరు రోజులతరబడి నిద్రపోకుండా గడిపేస్తూ ఉంటారు. అలాంటి వారు అనవసరంగా చికాకు పడడం, దేనిమీదా సరయిన ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ ముఖంలో ఏదో ఒక విచారము, నఖశిఖ పర్యంతం ఏదో రుగ్మత, నిరాశ, నిస్పృహ ఉండడం, వ్యక్తులతో దూరంగా మసలడం, ప్రతి దానికి తేలికగా అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. 


ఇలాంటి వ్యక్తులు కూడా నిద్ర రాని వ్యాధితో బాధపడడం సహజం. న్యూరోసిస్ గాని, సైకోసిస్ గాని, నిరుత్సాహంగాని మానసిక వ్యాధులే. ఈ మానసిక వ్యాధుల తీవ్రతను బట్టి అసలు నిద్ర పట్టకపోవడమా, కొద్దిగా నిద్రపట్టడమా లాంటివి ఆధారపడి వుంటాయి. డిప్రషన్ తో బాధపడే చాలామంది తాము ఫలానా కారణం వల్ల బాధపడుతున్నామని తెలుసుకోలేక నిద్రపట్టక పోవడం వల్లనే తక్కిన లక్షణాలన్నీ వున్నాయని భావిస్తారు. కాని నిద్ర పట్టకపోవడం కూడా డిప్రషన్ లో ఒక లక్షణమని గుర్తించరు. 


నిద్ర రాకపోవడానికి మానసిక వ్యాధులు కారణమయిన పక్షంలో కాస్తో కూస్తో నిద్రను కూడా చెడగొట్టే ఇతర  స్థితులు సైతం "ఇన్సామ్నియా"కి దోహదం చేస్తాయి. కొందరికి నిద్రపట్టి పట్టగానే కాలో చెయ్యో అకస్మాత్తుగా ఎవరో పట్టుకొని గట్టిగా ఊపేసినట్లయి వెలుకువ వచ్చేస్తుంది. కొందరికి మొత్తం శరీరాన్నే కుదిపేసినట్లు అవుతుంది. ఇలా జరగడానికి నిద్రపోయే వ్యక్తిలో ముఖ్య మయిన నాడీ కేంద్రాలు కూడా విశ్రమిస్తే, చిన్న చిన్న నాడీ కేంద్రాలు స్వేచ్ఛ వచ్చినట్లయి ఒక్కసారిగా విచ్చలవిడిగా వ్యవహరించడమే కారణం.


నిద్రపట్టక పోవడానికి తగిన మానసిక వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. మానసిక ఆందోళన, చికాకులు నిద్రపట్టకపోవడానికి కారణాలు అయిన పక్షంలో ట్రాన్క్విలైజర్స్, డిప్రషను అయితే అది పోవడానికి మందులు వాడితే మంచి ఫలికాలు కలుగుతాయి. సరైన చికిత్స పొందకుండా ఊరుకుంటే ఆ వ్యక్తిలో వృత్తి నైపుణ్యము తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా త్వరగా దెబ్బతింటుంది.

  ◆నిశ్శబ్ద.